చెల్లించగలిగితే చాలు.. రుణమిస్తాం | Sakshi
Sakshi News home page

చెల్లించగలిగితే చాలు.. రుణమిస్తాం

Published Thu, Dec 12 2013 1:40 AM

చెల్లించగలిగితే చాలు.. రుణమిస్తాం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెల్లించగలిగే స్థోమత ఉన్న వారికి రుణమిస్తామని ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు తెలిపింది. ఇల్లు కట్టుకోవాలని, కారు కొనుక్కోవాలని, ఉన్నత విద్య అభ్యసించాలని, వ్యాపారం ప్రారంభించాలని.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సామాన్యుల ఆకాంక్షను నెరవేరుస్తామని బ్యాంకు సీఎండీ ఆర్.కె.దూబే స్పష్టం చేశారు. రెండు రోజులపాటు జరుగనున్న కెనరా బ్యాంకు మెగా రిటైల్, ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోను బుధవారమిక్కడ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. చిల్లర వర్తకం, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్ రంగాలకు విరివిగా రుణాలిస్తున్నట్టు చెప్పారు.
 
 మరో మూడు సర్కిల్స్..: రాష్ట్రంలో రాజకీయంగా సమస్యలున్నాయని బ్యాంకు సిబ్బంది తనతో అన్నారని దూబే తెలిపారు. రాజకీయ అంశాలతో బ్యాంకు సేవలను ముడిపెట్టవద్దని వారికి సూచించినట్లు తెలిపారు.  ఎక్స్‌పో సందర్భంగా 16,695 మంది లబ్ధిదారులకు రూ.359 కోట్ల మేర రుణాలిస్తున్నట్టు చెప్పారు. తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
 
 ఎన్‌పీఏ మరింత తగ్గుతుంది..
 కెనరా బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) ప్రస్తుతం 2.5 శాతముంది. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని బ్యాంకు ఆశిస్తోంది. మార్చికల్లా రూ.2,500 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉంది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి రావాల్సిన రూ.350 కోట్ల బకాయికి సంబంధించి కోర్టు నుంచి ఆ కంపెనీ ఆస్తుల అటాచ్‌మెంట్ లేదా అమ్మకం ఆదేశాలు రావొచ్చని బ్యాంకు ఆశిస్తోంది.
 
 ఇ-లాంజ్‌లో ఎన్నో సేవలు..
 కెనరా బ్యాంకు ఇ-లాంజ్ పేరుతో వినూత్న కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో నగదు డ్రా చేసుకోవడంతోపాటు చెక్కులను డిపాజిట్ చేయవచ్చు. లావాదేవీల వివరాలను పాస్ బుక్‌లో ముద్రించుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఏవైనా సమస్యలు తలెత్తితే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఫోన్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు సహాయపడేందుకు ఒక ఉద్యోగి ఉంటారు. దేశవ్యాప్తంగా ఇటువంటి లాంజ్‌లు 35 ఉన్నాయి.
 

Advertisement
Advertisement