42 బస్సులకు నిప్పంటించింది 22 ఏళ్ల యువతి! | Sakshi
Sakshi News home page

42 బస్సులకు నిప్పంటించింది 22 ఏళ్ల యువతి!

Published Sun, Sep 18 2016 11:12 AM

Cauvery water row: Woman who burnt 42 buses is only 22

బెంగుళూరు: కావేరి జలాలపై అట్టుడికిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. కాగా, ఈ వివాద ఆందోళనల్లో తమిళనాడు బస్సులకు ఆందోళనకారులు నిప్పంటించిన విషయం తెలిసిందే. బస్సులకు నిప్పంటించే విధంగా ఆందోళనకారులను ఉసిగొల్పిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నిప్పంటించిన వారికోసం వెతుకులాట ప్రారంభించిన పోలీసులు తొలుత ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితురాలు యాదగిరికి చెందిన సీ భాగ్య(22)గా గుర్తించారు.

నిందితురాలి కోసం ప్రత్యేక టీంలను రంగంలోకి దించిన కర్ణాటక పోలీసులు గురువారం రాత్రి యాదగిరికి చెందిన సీ భాగ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పేద కుటుంబానికి చెందిన భాగ్య రోజూ వారీ కూలీ. తన తల్లిదండ్రులు చంద్రకాంత్, ఎల్లమ్మలతో పాటు గిరీనగర్లోని కేపీన్ బస్సుల గ్యారేజ్ కు చేరువలో నివసిస్తోంది. కావేరీ జలాలపై ఆందోళనలు జరుగుతుండగా.. డి సౌజా నగర్ లో గ్యారేజ్ లో 42 కేపీఎన్ బస్సులకు నిప్పంటించాలంటూ ఆందోళనకారులను రెచ్చగొట్టింది. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు బస్సులకు నిప్పంటించడం దేశంలో సంచలనం సృష్టించింది.

భాగ్యపై పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. బస్సులకు నిప్పంటించేలా చేయడంపై పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేసును విచారించిన న్యాయస్ధానం నిందితురాలికి రిమాండ్ విధించింది. ఆర్ధిక కారణాల దృష్ట్యా ఆమె తరఫు వాదించేందుకు లాయర్ ను ఏర్పాటు చేసుకోకపోవడంతో.. నగర లాయర్ యూనియన్ ఉచితంగా ఆమె కేసును వాదించేందుకు ముందుకొచ్చింది.

బస్సులకు నిప్పంటించేందుకు వచ్చిన ఆందోళనకారులను భాగ్య లీడ్ చేసినట్లు దాడిలో గాయపడిన కేపీఎన్ డ్రైవర్లు పేర్కొన్నారు. అరెస్టుపై స్పందించిన కేపీఎన్ ట్రావెల్స్ యజమాని కేపీ నటరాజన్ ఘటనపై ముఖ్యమంత్రికి పూర్తివివరాలను అందజేయనున్నట్లు తెలిపారు. బస్సులకు నిప్పంటించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరతామని చెప్పారు.

 

Advertisement
Advertisement