షాకింగ్‌: ఆ వీడియోలు మాయం! | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: ఆ వీడియోలు మాయం!

Published Mon, Aug 7 2017 12:03 PM

షాకింగ్‌: ఆ వీడియోలు మాయం!

న్యూఢిల్లీ: హరియాణ బీజేపీ చీఫ్‌ కొడుకు యువతిని వేధించిన కేసులో షాకింగ్‌ పరిణామం.. ఈ కేసుకు సంబంధించి ఐదు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా దృశ్యాలు మాయమవ్వడం కలకలం రేపుతోంది. హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌ బరాలా కొడుకు వికాస్‌ బరాలా గత శుక్రవారం ఓ యువతిని కారులో వెంబడించి వేధించిన సంగతి తెలిసిందే. అతను కారులో యువతిని వెంబండించిన ఐదు ప్రదేశాల్లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలు మాయయ్యాయి. ఈ కేసు విచారణలో ఈ దృశ్యాలు అత్యంత కీలకమని భావిస్తున్న తరుణంలో ఇవి కనిపించడం లేదని పోలీసులు పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మరోవైపు ఈ కేసులో బాధితురాలైన ఐఏఎస్‌ అధికారి కూతురినే బీజేపీ రాష్ట్ర శాఖ నిందించడం గమనార్హం. అర్ధరాత్రి బాధితురాలు ఒంటరిగా ఎందుకు వెళ్లిందంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంవీర్‌ భట్టీ పేర్కొన్నారు. 'అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె బయటకు వెళ్లాల్సింది కాదు. ఆమె ఒక్కరే కారు నడుపుకుంటా అంత రాత్రి ఎందుకు వెళ్లింది?' అని భట్టీ ప్రశ్నించారు.
 

చండీగఢ్‌లో గత శుక్రవారం రాత్రి బాధితురాలు కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్, అతని  స్నేహితుడు ఆశిష్‌ తమ ఎస్‌యూవీ వాహనంలో ఆమెను వెంబడించారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు. అప్పటికే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడే వికాస్‌ను, ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. తను ఐఏఎస్‌ అధికారి కూతురిని అయినందుకు దుండగుల నుంచి తప్పించుకున్నానని, తానొక సామాన్యుడి కూతురిని అయి ఉంటే తనపై అత్యాచారం జరిగి, హత్య జరిగి ఉండేదేమోనని బాధితురాలు ఫేస్‌బుక్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజకీయ ప్రాబల్యమున్న నిందితులకు బెయిల్‌ ఇచ్చి.. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement
Advertisement