టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు | Sakshi
Sakshi News home page

టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు

Published Mon, Oct 5 2015 2:38 AM

టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు - Sakshi

♦ ఎన్టీఆర్ భవన్‌లో ప్రమాణస్వీకారం
♦ పార్టీ జాతీయ, ఏపీ, తెలంగాణ కమిటీలతో ప్రమాణం చేయించిన బాబు
♦ సమస్యలపై దృష్టి పెట్టాలని కార్యవర్గాలకు పిలుపు
 
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆదివారమిక్కడ ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జాతీయాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో పార్టీ జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర కమిటీల్లో సభ్యులుగా నియమితులైన నేతలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించారు. ఈ క్రమంలో చంద్రబాబుతోపాటు ఏపీ, తెలంగాణ కమిటీల అధ్యక్షులుగా కిమిడి కళా వెంకట్రావు, ఎల్.రమణ, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన కేంద్రమంత్రి పి.అశోక్ గజపతిరాజు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న, తెలంగాణ తెలుగుయువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ తదితరులతో చంద్రబాబు విడిగా ప్రమాణం చేయించారు.

 ప్రజల మన్ననలు పొందండి..
 చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టి ప్రజల మన్ననలు పొందాలని పార్టీ నూతన కార్యవర్గాలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన హామీల పరిష్కారానికి కృషిచేయాలని ఏపీ కమిటీ సభ్యులకు సూచించారు. తెలంగాణ కమిటీ సభ్యులు అక్కడి అధికారపార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకోసం  పోరాడాలన్నారు. పార్టీ పదవులు పొందిన నేతల పనితీరును మూడు నెలలకోమారు కార్యకర్తలనుంచి సమాచార సేకరణ ద్వారా బేరీజు వేస్తానని చంద్రబాబు చెప్పారు.

దాని ఆధారంగానే పదవులిస్తానని చెప్పారు. ఇప్పటినుంచే 2019 ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవ్వాలని బాబు కోరారు. ఇదిలా ఉంటే గతంలో పార్టీ  ప్రమాణపత్రంలో ‘నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ సాక్షిగా’ అని ముద్రించేవారు. ఇపుడు ఇతర పార్టీలనుంచి వచ్చిన వారికి పదవులిస్తుండటంతో ‘నాకు జన్మనిచ్చి న భారతావని సాక్షిగా’ అని పొందుపరిచారు.

 రైతులకు భరోసా కల్పిస్తాం : ఎల్.రమణ
 తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తమ పార్టీ తరఫున భరోసా కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
 
 ప్రమాణ స్వీకారానికి సీనియర్ల డుమ్మా
 
తెలంగాణ టీడీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. రాష్ట్ర కమిటీ కూర్పుపై ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్న పార్టీ సీనియర్లు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, ఇ.పెద్దిరెడ్డి వంటి వారికి రాష్ట్ర కమిటీలో, పొలిట్‌బ్యూరో స్థానం దక్కినా వారు అసంతృప్తిగానే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ సైతం కార్యక్రమానికి హాజరు కాలేదు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఎల్.రమణకు అవకాశం కల్పించడంపై ఎవరికీ అభ్యంతరం లేకున్నా, సీనియర్లను కాదని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడాన్ని వీరు తప్పుబడుతున్నారు.

కొన్నాళ్లుగా తెలంగాణ టీడీపీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఎర్రబెల్లిని పొలిట్‌బ్యూరోకు పరిమితం చేయడంపై కినుక వహించారు. గత పదిహేను నెలలుగా పార్టీతో అంటీ ముట్టనట్లు ఉంటున్న వరంగల్ జిల్లా నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడం, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు నుంచి తనను త ప్పించడంపై ఎర్రబెల్లి ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఇదే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించిన ఇనుగాల పెద్దిరెడ్డికి అది దక్కకపోగా జూనియర్లతో కలిపి అధికార ప్రతినిధి పదవి మాత్రమే ఇచ్చారు. దీంతో ఆయనా అలకబూనారు.

నిజామాబాద్ జిల్లాలో తన కంటే జూనియర్ అయిన అన్నపూర్ణమ్మకు ఇచ్చిన పాటి గుర్తింపు కూడా తనకివ్వలేదని మండవ వెంకటేశ్వరరావు కినుక వహించారు. నగర కమిటీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని మాజీ మంత్రి కృష్ణయాదవ్ అవమానంగా భావిస్తున్నారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్ష పదవి దక్కినా ప్రమాణ స్వీకారానికి  రాలేదు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు నగర అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ కార్యకర్తలకు ఎలాంటి సందేశం పంపుతున్నారని వీరు నిలదీస్తున్నారు. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్‌ను కూడా పొలిట్‌బ్యూరోకే పరిమితం చేశారు. దీంతో ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నారని చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement