కారు కోసం.. ఇంట్లో నగల చోరీ! | Sakshi
Sakshi News home page

కారు కోసం.. ఇంట్లో నగల చోరీ!

Published Tue, May 3 2016 6:51 PM

కారు కోసం.. ఇంట్లో నగల చోరీ! - Sakshi

విలాసాలకు అలవాటు పడిన విద్యార్థులు.. ఎంతటి ఘోరాలకైనా పాల్పడుతున్నారు. తాజాగా చెన్నై పోలీసులు ఇలాంటి కేసును ఛేదించారు. కారు కొనుక్కోవాలన్న ఆశతో సొంత ఇంట్లోంచి రూ. 7.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన విద్యార్థితో పాటు అతడి ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మహేంద్రన్ (19) రామాపురం ప్రాంతంలోని నారాయణ్ లాల్ అనే వ్యాపారి చిన్నకొడుకు. ఆయనకు తన ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో హార్డ్‌వేర్ దుకాణం ఉంది. మహేంద్రన్ చెన్నైలోని ఓ ప్రైవేటు కాలేజిలో బీసీఏ చదువుతున్నాడు. అతడితో పాటు నారాయణ్ లాల్‌కు ఉత్తమ్‌చంద్ అనే మరో కొడుకు, ఇంకో కూతురు ఉన్నారు.  

ఇటీవల లాల్ తన భార్య, కుమార్తెలతో కలిసి రాజస్థాన్ వెళ్లారు. దుకాణం బాధ్యతలను తన పెద్దకొడుక్కి అప్పగించారు. ఆదివారం నాడు మహేంద్రన్, ఉత్తమ్‌చంద్, దుకాణంలో పనిచేసే మరో నలుగురు కలిసి కొలపాక్కం ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఈలోపు మహేంద్రన్ స్నేహితులు జీవా, రాజేష్ కుమార్ కలిసి డూప్లికేట్ తాళాలతో ఇంట్లోకి ప్రవేశించి, నగలన్నీ చోరీ చేశారు. నగలన్నీ తీసుకున్న తర్వాత.. తాళాన్ని డ్రిల్లింగ్ చేసి, ఎవరో బలవంతంగా లోపలకు వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు.

చోరీ విషయం తెలియగానే మహేంద్రన్ షాకైనట్లు నటించాడు. ఉత్తమ్‌చంద్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. విచారణలో పోలీసులకు.. తాళాన్ని లోపలి నుంచి డ్రిల్లింగ్ చేసినట్లు తెలిసింది. ఎవరో బాగా తెలిసినవాళ్లే చేసి ఉంటారని గట్టిగా విచారణ చేస్తే, మహేంద్రన్ విషయం తెలిసింది. తమదైన శైలిలో అడిగితే.. కారు కొనుక్కోడానికే ఈ దొంగతనం చేయించినట్లు మహేంద్రన్ వెల్లడించాడు.

Advertisement
Advertisement