పెట్రేగిన చైనా.. మానస సరోవర్‌ మార్గం బంద్‌! | Sakshi
Sakshi News home page

పెట్రేగిన చైనా.. మానస సరోవర్‌ మార్గం బంద్‌!

Published Tue, Jun 27 2017 11:05 AM

పెట్రేగిన చైనా.. మానస సరోవర్‌ మార్గం బంద్‌!

భారతీయులు పవిత్రంగా భావించే కైలాస్‌ మానస సరోవర్‌ యాత్ర మార్గాన్ని మూసివేసిన విషయాన్ని చైనా బహాటంగా ఒప్పుకొంది. సిక్కింలోని సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల బాహాబాహి, భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ..  కైలాస్‌ మానస సరోవర్‌ యాత్ర మార్గమైన సిక్కింలోని నాథూలా పాస్‌ను మూసివేసినట్టు తెలిపింది.

చైనాకు చెందిన పిపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ జవాన్లు సిక్కింలోని సరిహద్దుల మీదుగా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి.. భారత సైన్యం బంకర్లను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. డ్రాగన్‌ సైనికుల దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొన్న భారత సైన్యం వారిని సరిహద్దులోకి రాకుండా అడ్డుకుంది. మానవహారంగా నిలబడి.. డ్రాగన్‌ సైనికులను వెనుకకు పంపింది. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కైలాస్‌ మనససరోవర్‌ యాత్ర మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించినట్టు చైనా చెప్పుకొచ్చింది. సరిహద్దుల్లో ఘర్షణాత్మక పరిస్థితికి భారత సైన్యమే కారణమని డ్రాగన్‌ సైన్యం నిందించింది. సరిహద్దుల్లోని తమ భూభాగంలో రోడ్డు నిర్మాణం చేపడుతుంటే భారత సైన్యం అడ్డుకొని రెచ్చగొట్టిందని, అందుకే బంకర్ల ధ్వంసం ఘటన జరిగిందని పేర్కొంది. కాగా, నాథులా పాస్‌ను మూసివేసిన విషయం నిజమేనని చైనా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.

కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు నాథులా పాస్‌ రెండో మార్గం. దీనిని 2015లోనే తెరిచారు. ఈ మార్గం ద్వారా ఈ నెల 19-23 తేదీల మధ్య 47 మంది ప్రయాణికులు బయలుదేరారు. కాగా, మరో మార్గమైన ఉత్తరాఖండ్‌లోని లిపుల్‌కేహ్‌ ద్వారా 1080 మంది ప్రయాణికులు కైలాస్ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారు.

Advertisement
Advertisement