పాక్ ను అడ్డంగా సమర్థించిన చైనా! | Sakshi
Sakshi News home page

పాక్ ను అడ్డంగా సమర్థించిన చైనా!

Published Mon, Oct 17 2016 5:10 PM

పాక్ ను అడ్డంగా సమర్థించిన చైనా! - Sakshi

ఉగ్రవాదానికి పాకిస్థాన్ పుట్టినిల్లు వంటిదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్న మరునాడే చైనా తన 'శాశ్వత మిత్రుడి'ని అడ్డంగా వెనకేసుకొచ్చింది. ఉగ్రవాదాన్ని ఏ దేశంతో ముడిపెట్టలేమంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకించింది. పాకిస్థాన్ చేసిన గొప్ప త్యాగాలను ప్రపంచం గుర్తించాలంటూ అడ్డగోలుగా వ్యాఖ్యానించింది.

గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్థాన్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై .ప్రశ్నించగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ ఘాటు స్పందించారు. ఉగ్రవాదంపై చైనా వైఖరి స్థిరంగా ఉందని చెప్తూనే.. ఉగ్రవాదాన్ని ఏ ఒక దేశంతోనో, మతంతోనో ముడిపెట్టడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.

'ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మేం వ్యతిరేకిస్తాం. అంతర్జాతీయంగా నిరంతర చర్యల ద్వారా అన్ని దేశాల్లో సుస్థిర భద్రత సాధ్యపడుతుందని భావిస్తున్నాం. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క దేశంతోనో, మతంతోనో ముడిపెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తాం. మేం చాలాకాలంగా అవలంబిస్తున్న వైఖరి ఇదే. చైనా, పాకిస్థాన్ అన్ని కాలాల్లోనూ శాశ్వత మిత్రులు' అని ఆమె తేల్చిచెప్పారు. భారత్, పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధితులేనని పేర్కొన్న ఆమె.. ' ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో పాకిస్థాన్ గొప్ప త్యాగాలు చేసింది. వీటిని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి' అని తెలిపారు. భారత్, పాకిస్థాన్ తమకు పొరుగుదేశాలు కావడంతో ఈ రెండు దేశాలు తమ మధ్య ఉన్న సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement