కొరియా మంటలు: రష్యా సాయం కోరిన చైనా! | Sakshi
Sakshi News home page

కొరియా మంటలు: రష్యా సాయం కోరిన చైనా!

Published Sat, Apr 15 2017 3:01 PM

కొరియా మంటలు: రష్యా సాయం కోరిన చైనా! - Sakshi

బీజింగ్‌: ఉత్తర కొరియా తన దుందుడుకు అణ్వస్త్ర ప్రయోగాలతో తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్న నేపథ్యంలో చైనా రష్యాను ఆశ్రయించింది. ఈ విషయంలో ఉద్రిక్తతలు సడలించేందుకు రష్యా సాయం చేయాలని కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగమంత్రి రష్యా విదేశాంగ మంత్రిని కోరారు. ఇప్పటికే ఉత్తర కొరియా రాజేసిన ‘అణు’ మంటలతో ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశముందని చైనా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ ఆంక్షలు, ఆందోళనలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా దూకుడుగా అణ్వాయుధ ప్రయోగాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్యలతో పుండు మీద కారం చల్లినట్టు మండిపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే కొరియా ద్వీపకల్పంలో తమ దేశ నేవీ దళాన్ని మోహరించారు. కొరియా బెదిరింపులను దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. మరోవైపు ఉత్తర కొరియా కూడా తగ్గేది లేదంటున్నది. అమెరికా ఏదైనా రెచ్చగొట్టే చర్యలకు దిగితే.. అంతేదీటుగా కనికరంలేకుండా బదులిస్తామని ప్రకటించింది.

ఉత్తర కొరియాకు ఏకైక మిత్రదేశం, ఆర్థిక ప్రాణాధారం అయిన చైనా ఈ ఉద్రిక్తతలతో ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్షణంలోనైనా యుద్ధం జరగవచ్చునని ఆ దేశం శుక్రవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌తో శుక్రవారం చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యి భేటీ అయ్యారు. కొరియా విషయంలో అన్ని పక్షాలను చర్చలకు ఆహ్వానించి ఉద్రిక్తతలను తగ్గుముఖం పట్టించడమే ఇరుదేశాల ధ్యేయమని చైనా ప్రకటించింది. ఈ విషయంలో రష్యా సాయాన్ని చైనా కోరినట్టు ఆ దేశ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement