ఎవరూ ఖాళీగా ఉండకూడదు.. | Sakshi
Sakshi News home page

ఎవరూ ఖాళీగా ఉండకూడదు..

Published Mon, Jan 18 2016 4:35 AM

ఎవరూ ఖాళీగా ఉండకూడదు.. - Sakshi

అందరూ ఏదోక పని చేస్తూ ఉండాలి : సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ: ‘రాష్ట్రంలో ఎవరూ ఖాళీగా ఉండకూడదు. అందరూ ఏదొక పనిచేస్తూ ఉండాలి. అందరిలోనూ వృత్తి నైపుణ్యం పెరగాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అదివారం విజయవాడలోని ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అందుకోసమే సర్వీస్ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించామని చెప్పారు.

రాష్ట్రంలో టెక్నాలజీని తాను వాడుకున్న రీతిలో బహుశా ఎవరూ వాడుకోరని వ్యాఖ్యానించారు. ఆనం బ్రదర్స్ చేరికను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇక, పనిచేయని ప్రభుత్వ ఉద్యోగులను ఉపేక్షించబోమన్నారు. అందుకే ఐవీఆర్‌ఎస్ సిస్టం ద్వారా ఫోన్‌లో ప్రజలతో మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సమాధానాలను బట్టి అధికారుల తీరును పరిశీలించి అవసరమైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నాయకత్వంలో తాము పనిచేస్తామని, పార్టీ ఏ పని చెబితే అది చేయడానికి తాము  సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి మాట్లాడుతూ ఆనం సోదరుల్ని 2014 ఎన్నికలకు మందే టీడీపీలోకి ఆహ్వానించామని, కాని వారు ఎందుకో రాలేదని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆనం బద్రర్స్‌తోపాటు వారి కుటుంబసభ్యులు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం శుభాకరరెడ్డి, ఆనం రంగనాథ్‌రెడ్డి, ఆనం సంజీవరెడ్డి, నందకుమార్‌రెడ్డిలతో పాటు పలువురు టీడీపీలో చేరారు.
 
పల్స్‌పోలియోను ప్రారంభించిన సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ నుంచి తీసుకెళ్లిన పసిపిల్లలకు ఆయన పోలియో చుక్కలు వేశారు.  
 
నేడు స్విట్జర్లాండ్‌కు సీఎం పయనం..
స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకూ జరగనున్న 46వ ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు అత్యున్నత అధికారుల బృందాన్ని వెంటబెట్టుకుని ఆయన సోమవారం సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు.

అనంతరం 24న తిరిగి ఆయన రాష్ట్రానికి చేరుకుంటారు. సదస్సుకు వచ్చే వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు దావోస్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ‘మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్’ పేరుతో ప్రత్యేక ప్రచార రథాన్ని అక్క డ తిప్పుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపారాలకున్న అవకాశాల గురించి ఈ బస్సు ద్వారా ప్రచారం చేస్తున్నారు.
 
ఉడుపికి చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం ఉడుపికి వెళ్లారు. సోమవారం ఉదయం అక్కడి పెజావర మఠాధిపతిగా విశ్వేశతీర్థ ఐదోసారి బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement