మమత విమానం ‘కుట్ర’లో మరో ట్విస్ట్‌! | Sakshi
Sakshi News home page

సీఎం విమానం ‘కుట్ర’లో మరో ట్విస్ట్‌!

Published Thu, Dec 8 2016 7:21 PM

మమత విమానం ‘కుట్ర’లో మరో ట్విస్ట్‌! - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ఇటీవల కోల్‌కతాలో ఆలస్యంగా ల్యాండ్‌ కావడం పెద్ద దుమారం రేపింది. విమానంలో ఇంధనం అయిపోతున్నా.. ల్యాండింగ్‌ చేసేందుకు అనుమతి ఇవ్వలేదని, ఇది మమతాబెనర్జీని హతమార్చేందుకు చేసిన కుట్ర అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, మమత ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌ ‘ఆల్యస్యం’ వెనుక అసలు రహస్యాన్ని తాజాగా డీజీసీఏ బట్టబయలు చేసింది. పైలట్లు కావాలనే త్వరగా విమానాన్ని ల్యాండింగ్‌ చేయించాలని ప్రయత్నించారని, సకాలంలో విమానాన్ని ల్యాండింగ్‌ చేసి.. మంచి పేరు తెచ్చుకోవాలనే తాపత్రయంతోనే పైలట్లు ‘నాటీ’ (కొంటెగా) వ్యవహరించారని, ఇలా చేసినందుకే వారిని విధుల నుంచి తప్పించామని పౌర విమానాయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.

నిజానికి మమత ప్రయాణిస్తున్న విమానంలో తగినంత ఇంధనం ఉందని, అయినా సకాలంలో ల్యాండ్‌ చేసి వృత్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే పైలట్లు ఇలా వ్యవహరించారని డీజీసీఏ తెలిపింది. కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యేందుకు ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్‌ విమానాలు ఒకేసమయంలో ప్రయత్నించాయి. అందులో మమతాబెనర్జీ ప్రయాణిస్తున్న ఇండిగో విమానం కూడా ఉంది. మొదట ఇండిగో విమాన పైలట్‌ ఇంధనం అయిపోతుంది ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరాడు. దీంతో ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ) ముందుగా ల్యాండ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఎయిరిండియా పైలట్‌ను సంప్రదించగా.. అతడు కూడా ఇంధనం అయిపోతుంది ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరాడు. మరోవైపు స్పైస్‌జెట్‌ విమానం నుంచి కూడా ఇదే అభ్యర్థన వచ్చింది.

మూడు విమానాలు ఒకేసారి లాండ్‌ అయ్యేందుకు వీలుకాకపోవడంతో ఒకదాని తర్వాత మరొకదానికి అనుమతి ఇచ్చారు. అయితే, మమత విమానాన్ని ప్రాధాన్యమిచ్చి మొదట ల్యాండ్‌ చేయకపోవడాన్ని తృణమూల్‌ ఎంపీలు తప్పుబట్టారు. నిజానికి ఈ మూడు విమానాల్లో తగినంత ఇంధనం ఉన్నప్పటికీ, ఇంధనం అయిపోయిందంటూ మూడు విమానాల పైలట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని, కాబట్టి ఆ మూడు విమానాల కాక్‌పిట్‌ సిబ్బందినంతటినీ (ఆరుగురు పైలట్ను) వారంపాటు విధుల్లోంచి తప్పించాలని ఆదేశించినట్లు స్పష్టం చేసింది. ల్యాండింగ్‌ ప్రయారిటీ ప్రకారమే మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న ఇండిగో విమానం దిగేందుకు అనుమతి ఇచ్చినట్టు స్పష్టం చేసింది. అదేవిధంగా పైలట్లకు సక్రమమైన శిక్షణ ఇవ్వాల్సిందిగా మూడు విమానాయాన సంస్థలకు ఘాటు వార్నింగ్‌ ఇచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement