మాజీ మిలిటెంట్‌ నివాసంలో సీఎం బస! | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: మాజీ మిలిటెంట్‌ నివాసంలో సీఎం బస!

Published Mon, Jan 30 2017 12:24 PM

మాజీ మిలిటెంట్‌ నివాసంలో సీఎం బస! - Sakshi

పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం రాత్రి ఓ మాజీ మిలిటెంట్‌ నివాసంలో బస చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాడికల్స్‌తో కేజ్రీవాల్‌ రాసుకుపూసుకు తిరుగుతున్నారని అకాలీదళ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతున్నాయి.

పంజాబ్‌లోని జిరాలో ఎన్నికల సభలో పాల్గొన్న అనంతరం రహస్యంగా మోగాకు చేరుకున్న కేజ్రీవాల్‌ శనివారం రాత్రి.. ఖలిస్థాన్‌ కమాండో ఫోర్స్‌ (కేసీఎఫ్‌) మిలిటెంట్‌ గురిందర్‌ సింగ్‌ నివాసంలో విశ్రాంతి తీసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. మిలిటెంట్‌ కేసు నుంచి బయటపడిన గురిందర్‌ సింగ్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నారు. మోగలోని తన స్వగ్రామం ఘాల్‌లో ఉన్న నివాసాన్ని ఇంగ్లండ్‌కు చెందిన తన స్నేహితుడు సత్నాం సింగ్‌కు లీజుకు ఇచ్చారు. సత్నాం సింగ్‌ తన నివాసంలోకి కేజ్రీవాల్‌ను సాదరంగా ఆహ్వానించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

కేసీఎఫ్‌ మిలిటెంట్‌ మాడ్యూల్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గురిందర్‌ సింగ్‌.. 1997లో మోగా జిల్లా బఘాపురానాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. మాజీ మిలిటెంట్‌ నివాసంలో సీఎం కేజ్రీవాల్‌ బస చేయడంపై ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. 'మాజీ మిలిటెంట్‌ ఇంట్లో గడుపడం ద్వారా పంజాబ్‌లో అధికారం కోసం తాను ఎంతకైనా తెగిస్తానని కేజ్రీవాల్‌ మరోసారి నిరూపించుకున్నారు' అని శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ విమర్శించారు. కేజ్రీవాల్‌ రాడికల్స్‌ జతకట్టడం పంజాబ్‌లో శాంతిభద్రతలకు తీవ్ర ప్రమాదకరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆప్‌ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. తమ అధినేత మాజీ మిలిటెంట్‌ నివాసంలో గడుపలేదని పేర్కొంటున్నది.
 

Advertisement
Advertisement