ఎవరేమన్నారు? | Sakshi
Sakshi News home page

ఎవరేమన్నారు?

Published Mon, Nov 9 2015 2:47 AM

ఎవరేమన్నారు? - Sakshi

 ‘‘బిహార్లో ప్రజా తీర్పును శిరసావహిస్తూ, ఓటమిని అంగీకరిస్తున్నాం. ఘనవిజయం సాధించిన నితీశ్ , లాలూలకు అభినందనలు’’
 అమిత్ షా(బీజేపీ చీఫ్)
 
 ‘‘మోదీనే మా పార్టీకి బలం.  ఈ  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించి, దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క కారణంపైననో గెలుపోటములు అధారపడబోవు’’   
 రాం మాధవ్ (బీజేపీ నేత)
 
 ‘‘మహా కూటమి విజయంలో లాలూ ప్రసాద్ కన్నా.. నితీశ్‌కుమార్‌దే కీలక పాత్ర.  సీఎంగా పదేళ్ల పాటు నితీశ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయనకు విజయం సాధించిపెట్టాయి’’      
చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీ నేత)
 
 ‘‘బిహార్‌లో మహా కూటమి గెలుపు.. బీజేపీ, ఆరెస్సెస్‌ల విభజనవాద అజెండా పరాజయం. విద్వేషంపై ప్రేమ.. విభజనపై ఐక్యత.. అసహనంపై సహనం సాధించిన విజయం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలను పక్కనబెట్టి రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. మాటలు కట్టిబెట్టి పని ప్రారంభించాలి. డ్రైవర్ సీట్లో కూర్చున్న మోదీ ఇకనైనా వేగం పెంచాలి. లేదంటే బిహార్‌లో లాగా.. ప్రజలు ఆ సీట్లోంచి తొలగించేస్తారు’’
     రాహుల్ గాంధీ(కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు)
 
 ‘‘బిహార్లో ఓటమి రాజకీయంగా ప్రధాని మోదీకి పెద్ద ఎదురుదెబ్బ. నియంతృత్వం తరహా నాయకత్వ తీరును ప్రజలు సహించబోరనడానికి ఇదే నిదర్శనం’’                
మల్లికార్జున్ ఖర్గే(లోక్‌సభలో విపక్ష నేత)
 
 ‘‘నితీశ్ కుమార్ మహానాయకుడు. ఆయన గెలుపు బిహార్‌కు అవసరం. బిహార్లో మహాకూటమి గెలుపు ఓ నాయకుడి పతనాన్ని(మోదీని ఉద్దేశించి) సూచిస్తోంది.  దేశ రాజకీయాల్లో ఈ ఫలితాలు ఒక కీలక మలుపునకు కారణమవుతాయయి’’
 సంజయ్ రౌత్(శివసేన ఎంపీ)
 
 ‘‘మహకూటమి గెలుపు ధనబలంపై విలువలతో కూడిన రాజకీయం సాధించిన విజయం’’        -శరద్ యాదవ్(జేడీయూ చీఫ్)
 
 ‘‘సహనం గెలిచింది. అసహనం ఓడింది. నితీశ్, లాలూకు అభినందనలు’’
 మమతా బెనర్జీ( బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్)
 
 ‘‘ఈ ఫలితాలు ప్రజాస్వామ్యం, బిహార్ ప్రజలు సాధించిన విజయం. అంతర్మధనానికి, మెరుగైన వ్యూహాలకు, మెరుగైన సమన్వయానికి, ఐక్య కృషికి ఇదే సరైన సమయం’’  
 - శత్రుఘ్న సిన్హా(బీజేపీ ఎంపీ)
 
 ‘‘విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడేవారికి చెంపదెబ్బలాంటి ఫలితాలివి.  ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పు. మోదీ అహంకారపూరిత పాలనకు, నియంతృత్వ పోకడలకు ఇవి రెఫరెండం. కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని ఈ ఫలితాలు బద్ధలు కొట్టాయి’’
 - అరవింద్ కేజ్రీవాల్(ఢిల్లీ సీఎం, ఆప్ నేత)
 
 ‘బీజేపీ ఓటమి ప్రధాని మోదీ వ్యక్తిగత ఓటమి. ఒక ప్రధాని.. ఒక రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యతనివ్వడం ఇదే ప్రథమం. బిహార్‌లో వచ్చే ఎన్నికల నాటికి మేం మరింత బలోపేతమవుతాం’’
                     అసదుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం చీఫ్)

ప్రజల అభిమానం చూరగొన్నారు

 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీశ్‌కుమార్‌కు అభినందనలు. రెండు సార్లు బిహార్ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన నితీశ్.. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. బిహార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మహా కూటమి మంచి పాలన అందించాలి.     
- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
 
 అభినందనలు
 బిహార్‌లో విజయం సాధించిన నితీష్ కుమార్‌కు అభినందనలు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు.       
- చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం
 
 లాలూ కింగ్ మేకర్
 బలమైన సామాజిక కూటముల కలయిక వల్లే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధిం చింది. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. వారి నిర్ణయానికి అనుగుణంగా బాధ్యతాయుత ప్రతిపక్షంగా బిహార్ అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తాం.  80 సీట్లు గెలుచుకున్న లాలూ.. ‘కింగ్ మేకర్’, ‘బిగ్‌బాస్’ అవుతారు. రాష్ట్రమంతా పర్యటించి పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకుంటాం.
- సుశీల్‌మోదీ(బీజేపీ), బిహార్ మాజీ డిప్యూటీసీఎం
 
 మోదీ, షా, జైట్లీలే బాధ్యులు
 బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలదే బాధ్యత.  అధిష్టానం తీరుకు నిరసనగా పార్టీ కార్యకర్తలు.. నిశ్శబ్దంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. అంతకుముందు ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రచారమంతా మోదీ కేంద్రీకృతంగా జరగటం, పార్టీ విభజన రాజకీయాల వల్లే ఓడిపోయారు.    
- అరుణ్‌శౌరీ, కేంద్ర మాజీ మంత్రి
 
 అభివృద్ధి ఫలితం
 ఈ గెలుపు రాష్ట్రంలో నితీశ్ సాధించిన అభివృద్ధి ఫలితం. సుపరిపాలనకు సామాజిక న్యాయానికి బిహార్ ఓటర్లు పట్టం కట్టారు.  - కరుణానిధి, డీఎంకే అధ్యక్షుడు
 
 పతనానికి ప్రారంభం
 ఈ ఫలితాలు ప్రధాని మోదీ పతనానికి ప్రారంభం. మతం పేరుతో ప్రజల్లో విభేదాలు పెంచాలన్న మోదీ ప్రయత్నం విఫలమైంది.   
  - ఊమెన్ చాందీ, కేరళ సీఎం
 
 మంచి రోజులు మొదలయ్యాయి
 దేశంలో మంచి రోజులు మొదలయ్యాయి. మోదీ హవాకు కాలం చెల్లడం ఢిల్లీ ఎన్నికలతోనే  ప్రారంభమైంది.
 - సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

Advertisement
Advertisement