Sakshi News home page

టోల్ ఉద్యమనేతపై దుండగుల కాల్పులు

Published Mon, Feb 16 2015 4:09 PM

టోల్ ఉద్యమనేతపై దుండగుల కాల్పులు

మహారాష్ర్టలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మోటార్ సైకిల్ వచ్చిన దుండగులు ఆయన నివాసం సమీపంలో ఈ ఘటనకు పాల్పడ్డారు. శివాజీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మార్నింగ్ వాక్ కోసం వెళ్లి వస్తుండగా అగంతుకులు ఈ దారుణానికి దిగారు.  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దుండగుల చర్యను తీవ్రంగా ఖండించారు.

నేరస్తులను పట్టుకునేందుకు పది పోలీసు టీంలను ఏర్పాటుచేసినట్లు సీఎం ఫడ్నవీస్ చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకరమని పవార్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేరగాళ్లను విడిచిపెట్టరాదని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ లోక్ సభ సభ్యురాలు సుప్రియా సూలే అన్నారు. శాంతిభద్రతలు ఆందోళనకరంగా మారాయని, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిని తొలగించాలని అసెంబ్లీ ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీకే పాటిల్ డిమాండ్ చేశారు. కాల్పులకు గురైన పన్సారే కోలాపూర్ ప్రాంతంలో టోల్ గేట్ వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్నిఉధృతంగా నడిపిస్తున్నారు. పన్సారే మెడ, చేతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లగా భార్య సౌమా పన్సారేకు ఒక బుల్లెట్ తగిలింది. వారిద్దరిని సమీపంలోని ఆస్టర్ ఆధార్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

What’s your opinion

Advertisement