ఉగ్రవాదులకు కాంగ్రెస్ వంతపాడుతోంది: జైట్లీ | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులకు కాంగ్రెస్ వంతపాడుతోంది: జైట్లీ

Published Thu, Nov 17 2016 6:00 PM

ఉగ్రవాదులకు కాంగ్రెస్ వంతపాడుతోంది: జైట్లీ - Sakshi

రాబోయే కొన్ని రోజుల్లో.. ప్రపంచంలోనే అతిపెద్ద నోట్ల మార్పిడి వ్యవహారం పూర్తవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన అల్టిమేటంను ఆయన కొట్టిపారేశారు. ఉగ్రవాదులకు కాంగ్రెస్ పార్టీ వంతపాడుతోందని మండిపడ్డారు. గత కొన్ని రోజుల్లో తమకు వినియోగదారుల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చాయని.. క్యూలో నిలబడినా నోట్లు అందడం లేదని చెప్పడం వల్లే నగదు మార్పిడి పరిమితి తగ్గించామని ఆయన చెప్పారు. ఏటీఎంలను యుద్ధప్రాతిపదికన రీకాలిబరేట్ చేస్తున్నామన్నారు. బ్యాంకు ఉద్యోగులు నిర్విరామంగా పనిచేస్తున్నారని, అందుకు వారిని అభినందించాల్సిందేనని, వాళ్లు గత ఏడు రోజుల్లో కోట్లాది రూపాయలు తమ చేతులతో మార్చారని జైట్లీ తెలిపారు. వారం రోజుల్లోనే బ్యాంకులలో రద్దీ తగ్గినందున ఇప్పుడు ఇక డబ్బులు దొరకవేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొంతమందికి మాత్రం అసౌకర్యం కలుగుతున్నందుకు చింతిస్తున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ఇది ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ విషయంలో తమకు మద్దతు పలుకుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పౌరులందరూ ఈ చర్యకు మద్దతు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని, కొంతమంది అనవసరంగా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. చాలామంది ముఖ్యమంత్రులు తమ నిర్ణయానికి మద్దతు తెలిపారని, వారిని అభినందిస్తున్నానని, కొంతమంది సీఎంలు మాత్రం లేనిపోని వివాదాలతో ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారని పరోక్షంగా అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలపై మండిపడ్డారు. 
 
ప్రతిపక్షం చర్చ నుంచి పారిపోతోందని... నల్లధనాన్ని, ఉగ్రవాదులకు డబ్బులు అందే ప్రక్రియను అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో వాళ్లకు స్వార్థ ప్రయోజనాలున్నాయని మండిపడ్డారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. తమ చర్యకు మద్దతు పలకాల్సింది పోయి విమర్శించడంతో పాటు దీన్ని పాక్ ఉగ్రవాదంతో పోల్చడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రాజ్యసభకు ప్రధానమంత్రే వచ్చి సమాధానం ఇవ్వాలనడం సరికాదని, చర్చకు ఎవరు సమాధానం చెప్పాలో నిర్ణయించుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement