‘హద్దు’ మీరితే ఊరుకోం! | Sakshi
Sakshi News home page

‘హద్దు’ మీరితే ఊరుకోం!

Published Wed, Oct 21 2015 12:20 PM

‘హద్దు’ మీరితే ఊరుకోం! - Sakshi

 ‘దానం’ వ్యవహార శైలిపై డిగ్గీకి జిల్లా నేతల ఫిర్యాదు
 జిల్లాలో జోక్యం చేసుకుంటే సహించేదిలేదని స్పష్టీకరణ
 పరిధిపై ఏఐసీసీ లేఖను చూపిన నాయకులు

హైదరాబాద్: కాంగ్రెస్‌లో సంస్థాగత పంచాయితీ అధిష్టానం పెద్దల దరికి చేరింది. శివారు ప్రాంతంలోని 48 జీహెచ్‌ఎంసీ డివిజన్లను తన పరిధిలోకి తేవాలని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ పునరుద్ఘాటించడం.. దీన్ని రంగారెడ్డి జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సారథ్యంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌రెడ్డి, నేతలు పి.కార్తీక్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్, రవికుమార్‌యాదవ్‌లు డి గ్గీని కలిసి మరోసారి తమ వాదనను గట్టిగా వినిపించారు.

దానం వ్యవహారైశె లితో పార్టీకి చెడ్డపేరు వస్తోందని ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇదే వ్యవహారంపై పత్రికలకెక్కారని, అప్పట్లోనే దీనిపై భైగోళికంగా జిల్లా సరిహద్దులను విభజిస్తూ ఏఐసీసీ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యవహారాల్లో తలదూర్చాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని తెగేసి చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల  నేపథ్యంలోనే మరోసారి వివాదాన్ని తెరమీదకు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.


 సమష్టిగా ఉన్నాం..
రంగారెడ్డి జిల్లాలో సంస్థాగతంగా బలంగా ఉన్నామని, నేతల మధ్య సమన్వయం కూడా బాగా ఉందని దిగ్విజయ్‌కు జిల్లా నేతలు వివరించారు. చేవెళ్ల- ప్రాణహిత డిజైన్ మార్పుపై పెద్దఎత్తున చేసిన ఉద్యమంతో అధికారపార్టీ ఇరుకున పడిందని, రైతు ఆత్మహత్యలపై కూడా జిల్లాస్థాయిలో ఆందోళనలు చేశామని అన్నారు. ప్రభుత్వంపై పోరాడుతూ ప్రజల్లోకి వెళ్తున్నామని, పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శ్రేణులు కూడా అహర్నిషలు కృషి చేస్తున్నాయని డిగ్గీకి వివరించారు.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టకుండా పొరుగు జిల్లాలో జోక్యం చేసుకోవాలని దానం చూడడం సరైన పద్ధతి కాదని అన్నారు. శివార్లను తన కనుసన్నల్లోకి తేకపోతే పార్టీ మారుతాననే దానం బెదిరింపులకు లొంగి.. 14 మంది నేతలను బలిచేయవద్దని పేర్కొన్నారు. జిల్లానేతల అభిప్రాయంతో ఏకీభవించిన దిగ్విజయ్.. గతంలోనే సంస్థాగత ఏఐసీసీ స్పష్టతనిచ్చినందున మరోసారి చర్చ అవసరంలేదని తేల్చిచెప్పారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement