అస్థిర ప్రభుత్వం వినాశకరం | Sakshi
Sakshi News home page

అస్థిర ప్రభుత్వం వినాశకరం

Published Sun, Jan 26 2014 1:28 AM

Constitution doesn't bar Chief minister from protesting, says arvind Kejriwal

గణతంత్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ఆందోళన
దేశచరిత్రలో 2014 చాలా కీలకం
ప్రజాకర్షక అరాచకత్వం పరిపాలనకు ప్రత్యామ్నాయం కాబోదు
ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై పరోక్ష దాడి

 
 న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్ష వ్యక్తం చేశారు. అస్థిర ప్రభుత్వం ఏర్పడితే.. చపలచిత్తులైన అవకాశవాదులకు అది ఆలవాలమవుతుందని, అది దేశానికి వినాశకారిగా పరిణమిస్తుందని హెచ్చరించారు. 65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి శనివారం ప్రసంగించారు. గత కొన్నేళ్ల ఖండిత, వివాదాస్పద రాజకీయాల నుంచి 2014లో దేశానికి విముక్తి లభించాలని, అందుకు తోడ్పడాలని భారతీయ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘మనమంతా ఓటర్లం. మనలో ప్రతి ఒక్కరికీ లోతైన బాధ్యత ఉంది. దేశాన్ని మనం నాశనం కానివ్వబోం. ఆత్మ పరిశీలనకు, కార్యాచరణకు ఇదే సరైన సమయం’ అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా.. సుస్థిరత, నిజాయితీ, అభివృద్ధికి నిబద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. పలు కీలకాంశాలపై రాష్ట్రపతి వ్యాఖ్యలు..
 
-    ప్రజాస్వామ్యం: ప్రజాస్వామ్యంపై మన అంకితభావాన్ని కొందరు నిరాశావాదులు పరిహసిస్తుంటారు. నేను మాత్రం నిరాశావాదిని కాదు. ఎందుకంటే తప్పులను సరిదిద్దుకునే సామర్ధ్యం ప్రజాస్వామ్యానికి ఉంది. ప్రజాస్వామ్యం తనకుతానే గాయాలను మాన్పుకోగలిగే వైద్యుడిలాంటిది. అధికారంలో ఉన్నవారికి ప్రజాస్వామ్యం ఒక పవిత్రమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఉల్లంఘించేవారు జాతి విద్రోహులు.
 -    2014: దేశ చరిత్రలో 2014 చాలా కీలకం కావాలి. ఈ సంవత్సరంలోనే జాతి లక్ష్యాలను, దేశభక్తిని పునరావిష్కరించుకోవాల్సి ఉంది. దేశాన్ని అగాధంలోంచి పైకి లాగి మళ్లీ అభివృద్ధి బాటన పరుగులు పెట్టించడానికి సన్నద్ధం కావాల్సి ఉంది. 1950 మన గణతంత్రం ఆవిర్భవించిన సంవత్సరం. అలాగే 2014 పునరుజ్జీవన సంవత్సరం అవుతుందన్న విశ్వాసం నాకుంది.
 -    ఆర్థికరంగం: గత రెండేళ్లుగా ఆర్థిక వృద్ధి నిదానించింది. అది ఆందోళన చెందాల్సిన విషయమే కానీ నిరాశ పడాల్సిన అవసరం లేదు. దేశ ఆర్థికరంగ పునరుత్తేజ సూచికలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
 -    అవినీతి: ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కేన్సర్ వంటిది అవినీతి. అవినీతిని, వనరులు నాశనం కావడాన్ని చూసే ప్రజలకు ఆగ్రహం వస్తోంది. పాలకులు తమ తప్పులను తొలగించుకోకపోతే, ఓటర్లు ఆ ప్రభుత్వాలను తొలగిస్తారు.
 - యువత: యువతకు ఉపాధి కల్పించాలి. వారికో అవకాశం ఇచ్చి చూడండి. వారు నిర్మించే భారత్‌ను చూసి మీరు ఆశ్చర్యపోతారు.
 - తీవ్రవాదం: మతవాద శక్తులు, తీవ్రవాదులు ప్రజల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ వారెన్నటికీ అందులో విజయం సాధించలేరు. మన భద్రతాబలగాలు వారిని సులభంగా అణచేయగలవు.
 - విద్య: విద్య కొందరు ధనవంతులు, గొప్పవారికే లభించేది కాదు. అది ఒక సార్వజనీన హక్కు. దేశ భవితకు విత్తు. విద్యారంగంలో విప్లవం రావాల్సి ఉంది.  పట్టుదలగా కృషి చేస్తే విద్యారంగంలో ప్రపంచంలోనే మనం అగ్రస్థానం సాధించగలం.
 
 ప్రభుత్వం సేవాసంస్థ కాదు
 ఇటీవల దేశ రాజకీయ యవనిక పైకి అనూహ్యంగా దూసుకువచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, ఆయన ఇటీవల చేసిన ధర్నాపై ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో పరోక్ష దాడి చేశారు. కేజ్రీవాల్ పేరును ప్రస్తావించకుండానే.. ‘ప్రజాకర్షక అరాచకత్వం.. పరిపాలనకు ప్రత్యామ్నాయం కాబోదు. ప్రభుత్వం సేవాసంస్థ కాదు. భ్రమల్లో జీవించేందుకు ఎన్నికలు ఎవరికీ లెసైన్స్ ఇవ్వవు. ఓటర్ల విశ్వాసం పొందాలంటే ఆచరణసాధ్యమని భావించే హామీలనే ఇవ్వాలి. తప్పుడు హామీలు భ్రమల్లోకి తీసుకువెళ్తాయి. వాటిని అమలు చేయలేనప్పుడు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. పాలకులే వారి న్యాయమైన లక్ష్యం. వారిపైనే ఆ ఆగ్రహాన్ని గురిపెడ్తారు.
 
 చిన్న రాష్ట్రాలపై చర్చ న్యాయబద్ధం
 సాక్షి, న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర విభజనపై వాడి,వేడి చర్చ జరుగుతున్న తరుణంలోనే.. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గణతంత్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా చిన్న రాష్టాల ఏర్పాటుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధిని ఆకాంక్షిస్తూ చిన్న రాష్ట్రాలకోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. చిన్న రాష్ట్రాలపై చర్చ న్యాయబద్ధమైనదే. అయితే ప్రజాస్వామిక నియమాల పరిధిలోనే ఆ చర్చ జరగాలి. విభజించు, పాలించు రాజకీయాల వల్ల మన ఉపఖండం ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది. కలిసి పని చేయలేకపోతే ఏదీ సాధించలేం.
 
 బలవంతంగా కాకుండా, చర్చలు, అంగీకారం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రజాస్వామ్య లక్షణం. అయితే, ఆరోగ్యకర అభిప్రాయభేదాలు రాజకీయ వ్యవస్థలో అనారోగ్యకర అశాంతికి దారి తీయకూడదు’ అన్నారు. ‘ప్రజాస్వామ్య దేశం ఎల్లప్పుడూ ఆత్మ పరిశీలన చేసుకుంటుంది. తన్ను తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది. అది తప్పదు. ఎందుకంటే చర్చలు, అంగీకారం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి’ అని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement