అమరావతికి నిరంతర విద్యుత్ | Sakshi
Sakshi News home page

అమరావతికి నిరంతర విద్యుత్

Published Sat, Dec 26 2015 3:43 AM

Continuous power to Amravati

తొలిదశలో 2 వేల మెగావాట్ల సరఫరా
ముసాయిదాలో ట్రాన్స్‌కో వెల్లడి

 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తొలిదశలో నిరంతరాయంగా రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా 2021 నాటికి 5 వేల మెగావాట్లకు పెంచాలని భావిస్తోంది. ప్రభుత్వం తాజాగా రూపొం దించిన  బృహత్తర ప్రణాళికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇందుకోసం రూ. 1,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అమరావతి చుట్టూ అన్ని ప్రాంతాల నుంచి విద్యుత్‌ను ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ద్వారా అందించేందుకు నాలుగు 400 కేవీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు.

 అంతా భూగర్భ కేబుళ్ల ద్వారానే
 తొలిదశలో కామవరపు కోటలో మాత్రమే 400 కేవీ వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మిగిలినవి గుడివాడ, చిలకలూరిపేట, సత్తెనపల్లిలో ఏర్పాటు చేసి వీటిని విజయవాడ వరకూ కలుపుతారు. పూడిమడక నుంచి విద్యుత్‌ను అందించేందుకు వీలుగా 765 కేవీ లైన్‌ను ఏలూరు వరకూ విస్తరించాలని ప్రతిపాదించారు. విశాఖలో హిందూజా అందించే విద్యుత్‌ను కామవరపు కోటకు తరలించి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు.

ఇబ్రహీంపట్నంలో ప్రతిపాదిస్తున్న 800 మెగావాట్ల  ప్రాజెక్టుకు అనుబంధంగా మూడు 220 కేవీ లైన్లు నిర్మిస్తున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో మరో ఆరు 132 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.  భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరా ఉంటుందని ముసాయిదాలో స్పష్టం చేశారు. బాహ్య వలయం పరిధిలో ఉండే 400 కేవీ లైన్లను కూడా భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారానే అనుసంధానం చేయాలని సింగపూర్ సంస్థలు సూచిస్తున్నాయి. దీనికి ట్రాన్స్‌కో సానుకూలంగా స్పందించడం లేదు. దీనివల్ల వ్యయం పెరుగుతుందని ట్రాన్స్‌కో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement