వాట్సాప్‌లో కామెంట్‌.. ఉద్యోగం ఊడింది | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో కామెంట్‌.. ఉద్యోగం ఊడింది

Published Wed, Mar 22 2017 5:23 PM

వాట్సాప్‌లో కామెంట్‌.. ఉద్యోగం ఊడింది

నగరంలోని ప్రతిష్టాత్మకమైన కేఎంసీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో పనిచేస్తున్న సునీల్‌ వాగ్మేర్‌ను చితకబాదుతున్నారన్న విషయం తెలిసి ముంబై పోలీసులు ఆయన్ని రక్షించడానికి హుటాహుటిన కాలీజీకి వెళ్లారు. అక్కడ ఆయన్ని బాదుతున్నది ఎవరో కాదు, ఆయన సహచర అధ్యాపకులు, విద్యార్థులు. చేయిచేసుకున్న వారిని అరెస్ట్‌ చేయాల్సిన పోలీసులు బాధితుడైన సునీల్‌ వాగ్మేర్‌ను అరెస్ట్‌ చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని 295 ఏ సెక్షన్‌ కింద కేసు కూడా నమోదు చేశారు. ఆయనపై దాడిచేసిన వారిపై చర్య తీసుకోవాల్సిన కాలేజీ యాజమాన్యం ప్రొఫెసర్‌ సునీల్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఆయన చేసిన తప్పేమిటంటే ‘ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిని ఫిబ్రవరి 19వ తేదీనే అధికారికంగా జరుపుకున్నాం, మళ్లీ మార్చి 15వ తేదీన ఎందుకు జరుపుకుంటున్నారు’ అంటూ తన వాట్సాప్‌ గ్రూప్‌లో తన సహచర అధ్యాపకులను ప్రశ్నించడమే. మార్చి 16న కాలేజీకి వచ్చిన ప్రొఫెసర్‌ సునీల్‌ను పట్టుకొని ఆయన సహచర అధ్యాపకులు, హిందూ విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు చితకబాదారు. కొంతమంది హిందుత్వ వాదుల ఒత్తిడి మేరకు పోలీసులు బాధితుడినే అరెస్ట్‌ చేశారు. ఛత్రపతి శివాజీ జయంతిపై వివాదం ఈనాటిది కాదు. ఈ వివాదం ఇతర వర్గాల మధ్యన కాకుండా హిందూ వర్గాల మధ్యనే ఉండడం విశేషం.

మహారాష్ట్రలో గ్రెగోరియన్‌ క్యాలండర్‌ ప్రకారం కొంత మంది ఫిబ్రవరి 19వ తేదీన శివాజీ జయంతిని జరుపుకుంటారు. ఎక్కువ మంది ప్రజలు మాత్రం ఫల్గుణ మాసం మూడోరోజు తదియ నాడు జయంతిని జరుపుకుంటారు. తిథి ప్రకారం ఈసారి శివాజీ జయంతి మార్చి 15 తేదీన వచ్చింది. దాన్ని ప్రశ్నించడం సునీల్‌ది తప్పయింది. తిథి ప్రకారమే శివాజీ జయంతిని జరుపుకోవాలన్నది శివసేన మొదటి నుంచి చేస్తున్న వాదన. శివాజీ స్వయంగా మొఘల్‌ చక్రవర్తుల కాలంలో ఇస్లాం క్యాలెండర్‌ను తిరస్కరించినప్పుడు ఇతర దేశాలకు చెందిన గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం శివాజీ జయంతిని జరుపుకోవడం ఏమిటన్నది శివసేన ప్రశ్న. 1582లో ప్రపంచంలో చాలా దేశాలు ప్రామాణికంగా గుర్తించిన క్యాలెండర్‌ ‘గ్రెగోరియన్‌ క్యాలండర్‌’. అప్పటి పోప్ గ్రెగోరియన్‌ పేరిట వచ్చిన ఈ క్యాలెండర్‌ ప్రకారం ఏడాదిలో వచ్చే తేడా 0.002 శాతం మాత్రమే అయినందున నాటి కాలంలో గణిత పండితులు ఎక్కువ మంది దీన్ని ప్రామాణికంగా తీసుకునేవారు.

శివాజీ 16వ శతాబ్దంలో పుట్టారన్నది నిజమే అయినా.. ఏ సంవత్సరం, ఏ తేదీన పుట్టింది ఎవరికీ తెలియదు. ఆయన రాజ కుటుంబంలో కాకుండా శివాజీ భోన్స్‌లే అనే పోలీసు సుబేదార్‌కు పుట్టడమే అందుకు కారణం. రాజకుటుంబంలో పుట్టి ఉంటే కచ్చితంగా పుట్టిన రోజు నమోదయ్యేది. 1627లో పుట్టారని కొంత మంది, 1630లో పుట్టారని కొంత మంది చరిత్రకారులు చెబుతున్నారు. సంఘ సంస్కర్త లోకమాన్య తిలక్‌ 1980లో మొదటి సారిగా శివాజీ జయంతికి ప్రాచుర్యం కల్పించారు. అప్పటి నుంచి శివాజీ జయంతిపై వివాదం మరింత పెరిగింది. 2000 సంవత్సరంలో అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ వివాదానికి తెరదించేందుకు చరిత్రకారులతో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ ఫిబ్రవరి 19వ తేదీనే ఖరారు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును సెలవుదినంగా పాటిస్తోంది. అయినా వివాదం మాత్రం అలాగే కొనసాగుతోంది. రెండు తీదీలు వసంత మాసంలోనే వస్తున్నాయి కనుక ఏ రోజైనా జరుపుకోవచ్చని కొందరు సూచిస్తుండగా, రెండు రోజులూ జరుపుకోవచ్చని అహింసావాదులు సూచిస్తున్నారు. సునీల్‌పై దాడిని ఖండించని శివసేన మాత్రం, శివాజీ గొప్ప నాయకుడని, ప్రతిరోజు ఆయన జయంతిని జరుపుకోవచ్చని చెప్పింది.

Advertisement
Advertisement