కార్పొరేట్ వైద్యభారంపై తర్జనభర్జన | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ వైద్యభారంపై తర్జనభర్జన

Published Tue, Aug 25 2015 1:10 AM

కార్పొరేట్ వైద్యభారంపై తర్జనభర్జన - Sakshi

కొలిక్కిరాని ఆసుపత్రులు, సర్కార్ చర్చలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఖజనాపై పడే అదనపుభారం గురించి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఐదున్నర లక్షలున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందడంలేదు. సమస్యను కొలిక్కి తీసుకురాకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.

వైద్య మంత్రి కార్పొరేట్ ఆసుపత్రులతో సమావేశాలు నిర్వహించినా, సీఎస్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చించినా పురోగతి లేదు. ఉద్యోగులకు ఉచితంగా ఓపీ సేవలందిం చాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఎంతోకొం త ఫీజు ఇవ్వాల్సిందేనని కార్పొరేట్ యాజమాన్యాలు మొండికేస్తుడటంతో ప్రతిష్టంభన నెల కొంది. ఓపీ సేవలు ఉచితమైతే ఉద్యోగులు అవసరం ఉన్నా, లేకున్నా ఓపీ, వైద్య పరీక్షలు చేయించుకుంటారన్నది కార్పొరేట్ ఆసుపత్రుల ప్రధాన ఆరోపణ. ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు ఉద్యోగులు ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా అడుగు ముందుకు పడలేదు.

శస్త్రచికిత్సల ప్యాకేజీని 25 శాతం పెంచాలన్న యాజమాన్యాల డిమాండ్‌కు ప్రభుత్వం సుముఖంగా ఉంది. అయితే, మెడికల్ ప్యాకేజీ నిమ్స్ తరహాలో ఇవ్వాలని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం(టీషా) కోరుతోంది. దీనిపై టీషా ప్రతినిధులను ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిమ్స్ తరహా ప్యాకేజీకి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకు రూ.450 కోట్ల మేర ఖజానాపై అదనపు భారం పడుతుందని సర్కార్ అంచనా వేసింది. శస్త్రచికిత్సల ప్యాకేజీ 25 శాతం పెంచినా పెద్దగా భారం ఉండదని, మహా అయితే రూ. 170 కోట్లకు మించి ఖర్చుకాదని భావిస్తోంది.

Advertisement
Advertisement