కౌన్సెలింగ్‌పై స్పష్టత వచ్చేనా..? | Sakshi
Sakshi News home page

కౌన్సెలింగ్‌పై స్పష్టత వచ్చేనా..?

Published Mon, Jul 13 2015 12:08 AM

కౌన్సెలింగ్‌పై స్పష్టత వచ్చేనా..? - Sakshi

జేఎన్‌టీయూహెచ్ అప్పీల్‌పై
నేడు హైకోర్టు బెంచ్ విచారణ!

 
హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌పై స్పష్టత ఎప్పుడు వస్తుంది? ఇందుకోసం వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కౌన్సెలింగ్‌లో ఎడతెగని జాప్యంతో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల బాట పట్టగా, మరి కొంతమంది అందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల కౌన్సెలింగ్ త్వరగా ప్రారంభం కావాలని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ నెల 8 నుంచే వెబ్ ఆప్షన్లు ప్రారంభం కావాల్సి ఉన్నా సీట్లు కోత పడిన కాలేజీలు, అనుబంధ గుర్తింపు రాని కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు ఇచ్చిన అన్ని కాలేజీలు, అన్ని సీట్లను వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దానిని అమలు చేయకుండా జేఎన్‌టీయూహెచ్ డివిజన్ బెంచ్ అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై సోమవారం ఉదయం విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా కేసును ఎక్కువ కాలం కొనసాగించకుండా, త్వరగా తేల్చేందుకు ఇటు జేఎన్‌టీయూహెచ్, అటు యాజమాన్యాలు సహకరించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి, కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న దాదాపు 60 వేల మంది విద్యార్థులు కోరుతున్నారు.
 
 రెండు మూడు రోజుల్లో తేలకపోతే కష్టమే
 జేఎన్‌టీయూహెచ్, యాజమాన్యాల మధ్య ఏర్పడిన వివాదానికి రెండు మూడు రోజుల్లో ఏదైనా పరిష్కారం లభించకపోతే ఈ నెలాఖరుకల్లా ప్రవేశాలు పూర్తి చేయడం అసాధ్యమేనని అధికారులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ, వివాదం పరిష్కారం కాని పక్షంలో తరగతులు ప్రారంభించడం సాధ్యం కాదు. అపుడు జేఎన్‌టీయూహెచ్ లేదా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అఫిలియేషన్ల వివాదం ఉన్నందున ప్రవేశాల్లో అలస్యం అవుతుందని, తరగతుల ప్రారంభానికి మినహాయింపు ఇవ్వాలని కోరాల్సి వస్తుంది. కాలేజీల్లో మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అభినందనీయమేనని, అయితే పూర్తి ప్రవేశాల చివరి గడువు సమీపించిన సమయంలో గందరగోళ పరిస్థితులకు తెరతీయడం సరైంది కాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఒకసారి కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వమే అప్పీల్ వెళ్లడం వల్ల ప్రవేశాలు ఆలస్యం అవుతాయని, విద్యార్థులు నష్టపోతారని తెలిసీ ఈ చర్యలకు దిగడం ఏంటని పేర్కొంటున్నారు.
 
 

Advertisement
Advertisement