గొడవ తెచ్చిన గాడ్జెట్..! | Sakshi
Sakshi News home page

గొడవ తెచ్చిన గాడ్జెట్..!

Published Tue, Nov 10 2015 5:35 PM

గొడవ తెచ్చిన గాడ్జెట్..! - Sakshi

మార్కెట్లోకి కొత్తగా గాడ్జెట్ వచ్చింది కాదా అని వెనుకా ముందూ ఆలోచించకుండా కొనేస్తున్నారా? ఆ పరికరం మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడంతో పాటు... దానివల్ల ఇతరులకు ఏవైనా ఇబ్బందులున్నాయా అన్న వివరాలు కూడా కాస్త తెలుసుకోవడం మంచిదనిపిస్తోంది లండన్‌లో జరిగిన ఓ వివాదం చూస్తుంటే. టెక్నాలజీ వారి సమస్యకును సమాధానం ఇస్తుందనుకున్న ఆ దంపతులు... పిల్లల అల్లరి అరికట్టేందుకు అదొక్కటే మార్గంగా భావించారు. హై టెక్నాలజీ గాడ్జెట్‌ను ఇన్‌స్టాల్ చేసి, అల్లరి చేసే పిల్లలపై ప్రయోగించారు. దాని నుంచి వచ్చే తీవ్రమైన శబ్దంతో వారిని భయపెట్టి అల్లరికి దూరం చేయాలనుకున్నారు. కానీ వారి ప్రయత్నం బెడిసి కొట్టింది. కౌన్సిల్ నుంచి హెచ్చరికలు అందుకునేలా చేసింది.

మైఖేల్, కాథరిన్ మిట్చెల్... లు తమ ఇంటి బయట ఓ ప్రత్యేక గాడ్జెట్‌ను అమర్చారు. పిల్లల అరుపులు, అల్లరి వినిపించిందంటే చాలు ఆ పరికరం మరింత రెచ్చిపోతుంది. తీవ్రమైన శబ్దంతో వారిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. పదేళ్ళ కంటే తక్కువ వయసున్న పిల్లల, యువకుల గొంతు వినిపించిందో... ఇక అంతే వారిని ప్రత్యేకంగా ఆ గాడ్జెట్ భయకంపితుల్ని చేసేస్తుంది. ఈ నేపథ్యం  పక్క గార్డెన్‌లో ఆడుతున్న నలుగురు పిల్లలు ఉన్నట్లుండి వచ్చిన శబ్దంతో ఉలిక్కి పడ్డారు. దీంతో పొరుగింటివారు మైఖేల్ దంపతులపై మండలిలో ఫిర్యాదు చేశారు. వారికి కావలసిన నిశ్శబ్దం, శాంతి కోసం ఏర్పాటు చేసిన గాడ్జెట్.. ఇతరుల జీవితాల నాణ్యతపై హానికరమైన ప్రభావం సృష్టిస్తోందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

గాడ్జెట్‌తో వేధిస్తున్నారంటూ మైఖేల్ దంపతుల వివాదం కోర్టుకెక్కింది. ఇరుగు పొరుగుల మధ్య గందరగోళం చాలాకాలం నడిచింది. గాడ్జెట్ సౌండ్ తగ్గించాలని కోర్టు వారించింది. అయినప్పటికీ రాత్రి సమయంలో కూడ పెద్ద శబ్దంతో సంగీతం పెట్టి వేధిస్తున్నారంటూ వారిపై మరోసారి   పొరుగున ఉండే  ఛాపెల్  ఫిర్యాదు చేసింది. ఇది పెద్దలను కూడా చికాకు పెడుతోందని ఆరోపించింది. అయితే ముగ్గురు పిల్లలు, ఇద్దరు మనవళ్ళు ఉన్న మైఖేల్ దంపతులు కౌన్సిల్ నుంచి లేఖ రావడం కోపం తెప్పించిందని, తాము ఏం నేరం చేశామని ఆరోపణలు చేస్తారంటూ వాపోతున్నారు.  అంత తప్పేంచేశామని మాపై ఫిర్యాదు చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఆరోపణలు భయంకరంగా ఉన్నాయని, ఈ పరికరం సంఘవిద్రోహ శక్తిగా మారుతుందని తాము అనుకోలేదని, కాస్త మనశ్శాంతిని, నిశ్శబ్దాన్ని మాత్రమే తాము కోరుకున్నామని అంటున్నారు. తమకు కలుగుతున్న అసౌకర్యాన్ని పరిష్కరించుకునేందుకు డివైజ్ సహాయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు.

బోరో కౌన్సిల్ ఎన్విరాన్ మెంటల్ హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి లెటర్ రావడం తమకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటున్న మైఖేల్ దంపతులు.. నోటీసులకు స్పందించి డివైజ్ వాడకం నిలిపివేయకపోతే 2,500 యూరోలు జరిమానా వేస్తామని సిబ్బంది హెచ్చరించడం బాధ కలిగించిందని చెప్తున్నారు. ఇతరుల ఆరోపణలు విని, ఎన్ని చెప్పినా తమను చివరికి అరెస్టు కూడా చేశారని బోరుమంటున్నారు. డివైజ్ ను ఓ సెక్యూరిటీ కంపెనీ నుంచి కొన్నామని, అది వందశాతం లీగల్ పర్మిషన్, ఈయూ రెగ్యులేషన్స్ కూడా ఉన్నట్లుగా చెప్పారని అంటున్నారు. అయితే గాడ్జెట్.. మైఖేల్ దంపతులకు నిశ్శబ్దాన్ని ఇచ్చిందో లేదో కాని ఇరుగు పొరుగుల మధ్య తీవ్ర అగాధాన్ని నింపింది. మరింత గొడవలను రగల్చింది.

Advertisement
Advertisement