పత్రికారంగంలో కొత్త ‘ఉదయం’ | Dasari Narayana Rao started a sensational news paper in 1984 | Sakshi
Sakshi News home page

పత్రికారంగంలో కొత్త ‘ఉదయం’

Published Wed, May 31 2017 2:32 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

పత్రికారంగంలో కొత్త ‘ఉదయం’

పత్రికారంగంలో కొత్త ‘ఉదయం’

తెలుగు పత్రికారంగంలో ఒక సంచలనం ‘ఉదయం’ దినపత్రిక.

1984లో సంచలన పత్రికకు శ్రీకారం చుట్టిన దాసరి
ప్రజాతంత్ర శక్తుల చేతుల్లో కరదీపికగా వెలిగిన ఉదయం
ఆర్థిక కష్టాలతో ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి చేతుల్లోకి.. ఆ తర్వాత మూత
ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రతిపాదించింది కూడా దాసరే..
 
సాక్షి, అమరావతి: తెలుగు పత్రికారంగంలో ఒక సంచలనం ‘ఉదయం’ దినపత్రిక. సినీ దర్శకుడిగా ఉంటూనే రాజకీయాలు, సామాజిక అంశాల పట్ల మక్కువ కలిగిన దాసరి 1984 డిసెంబర్‌ 29న ఈ సంచలన పత్రికకు శ్రీకారం చుట్టారు. అప్పటికే పత్రికారంగంలో లబ్ధ ప్రతిష్టుడిగా పేరుపొందిన ఏబీకే ప్రసాద్‌ ఈ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. అన్ని వర్గాలు ప్రత్యేకించి బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు గొంతుకగా ఈ పత్రిక నిలిచింది. అవినీతిపై తిరుగు బావుటా ఎగరేసింది. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల చేతుల్లో కరదీపికగా నిలిచింది. అయితే పత్రికా నిర్వహణ భారం కావడంతో.. దాసరి చేతుల నుంచి నెల్లూరుకు చెందిన నాటి ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి చేతుల్లోకి వెళ్లి, తదనంతరం మూతపడింది. ఈ పత్రికను తిరిగి తీసుకొచ్చేందుకు దాసరి ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఉదయం మాదిరిగానే చిత్రపరిశ్రమ కోసం తీసుకొచ్చిన మరో సంచలనం శివరంజని, మేఘసందేశం కాగా, రాజకీయాల కోసం బొబ్బిలిపులి పేరుతో వారపత్రికను ఆయన నిర్వహించారు.
 
‘బాబుగారూ.. మా ప్రతిపాదన పట్టించుకోండి..’
అది 1999. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సినీ ప్రముఖలతో సమావేశం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాసరి నారాయణ రావు, ఆయన సతీమణి దాసరి పద్మ ఇద్దరూ వేదికపై ఉన్నారు. పద్మ మాట్లాడిన అనంతరం మైక్‌ తీసుకున్న దాసరి ‘‘చంద్రబాబునాయుడు గారూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు ఏదైనా మేలు చేయాలనుకుంటే.. మా మిత్రుడైన ఎన్టీ రామారావుకు భారతరత్న ఇప్పించండి. కేంద్రంలో మీరు మద్దతు ఇస్తున్న పార్టీలు అధికారంలో ఉన్నాయి. మీకు చాలా బలముంది అని చెబుతున్నారు కనుక మా ఈ పత్రిపాదను సీరియస్‌గా పట్టించుకోండి..’’ అని సూచించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కంటే ముందే చెప్పిన వ్యక్తి దాసరి అంటూ పలువురి సినీ, రాజకీయ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు.
 
నెరవేరని దాసరి కల
దాసరి తన చివరి కోరికగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై సినిమా తీయాలనుకున్నారు. కొన్నాళ్లుగా దాసరి ఈ చిత్రంపై పలువురితో చర్చించినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దానికి ‘అమ్మ’ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఒక సినిమా తీయాలని భావించినట్లు తెలుస్తోంది. కానీ దాసరి మరణంతో ఈ ప్రతిపాదనలను ఆగిపోయాయి.
 
చిన్న చిత్రాలను ఆదుకునేవాడు
చిన్న చిత్రాలను ప్రోత్సహించడంలో దాసరి ఎప్పుడూ ముందుండేవారు. సినిమాలు తీసి రిలీజ్‌ చేయలేక ఆగిపోయిన ఎన్నో చిత్రాలను సిరి మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా విడుదల చేయించారు. అంతేకాదు చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలకు మద్దతుగా బహిరంగంగా పెద్ద నిర్మాతలను  విమర్శించడానికి కూడా వెనుకాడలేదు. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు పోటీగా విశ్వామిత్ర అనే సీరియల్‌ను తీసి జాతీయస్థాయిలో దాసరి నారాయణ రావు ప్రసారం చేయించారు.
 
భోజనం పెట్టడమంటే అమితాసక్తి..
స్వతహాగా భోజన ప్రియుడైన దాసరి.. తనతో పాటు అనేకమందికి స్వయంగా భోజనాలు పెట్టేవారు. తన డైనింగ్‌ టేబుల్‌పై ఉన్న 12 సీట్లు నిండితే కాని ఆయన భోజనం తినడానికి ఇష్టపడేవారు కారు. అందులో కూడా కనీసం నాలుగైదు రకాల నాన్‌ వెజ్‌ వంటకాలు ఉండేలా చూసేవారు. అలాగే రాజకీయ, సినీ రంగంలో పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా సాయం కోసం వచ్చిన వారందరినీ ఆదుకునే లక్షణమే ఆయనకు ఇంతమంది అభిమానులను సమకూర్చింది. 
 
ఉద్యోగులతో కలిసే భోజనం..
దాసరి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ఉద్యోగులు
అది విజయవాడ బందరు రోడ్డులోని ఉదయం దినపత్రిక కార్యాలయం.. పత్రిక అధిపతి చెన్నై నుంచి వచ్చి ఉద్యోగులతో సమావేశమయ్యారు. తర్వాత అక్కడే భోజనానికి ఉపక్రమించారు. ఏసీ గదిలో ప్రత్యేకంగా భోజనం చేస్తారని అంతా భావించారు. కానీ తన ఛాంబర్‌ పక్కనున్న హాలులో భోజనానికి కూర్చున్నారు. తనతోపాటు ఉద్యోగులందరినీ భోజనానికి పిలిపించారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి ఉద్యోగులంతా ఆయనతో కలసి భోజనం చేశారు. అప్పట్లో రాష్ట్రమంతా సంచలనం సృష్టిస్తున్న పత్రికకు ఆయన అధిపతి. అంతేకాదు సినీ వినీలాకాశంలో అగ్రజుడు. ఆయన్ను ఒకసారి చూస్తే చాలనుకునేవారు ఎంతోమంది. అలాంటి వ్యక్తి తమతో కలసి భోజనం చేయడంతో ఉద్యోగులు ఆనందానికి అవధులు లేవు. ఆయన ఎవరో కాదు దర్శకరత్న దాసరి నారాయణరావు. అప్పుడే కాదు ఆయన ఎప్పుడు ఉదయం కార్యాలయానికి వచ్చినా ఉద్యోగులతో కలిసే భోజనం చేసేవారు. ఈ విషయాన్ని ఉదయంలో పనిచేసిన పలువురు ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు.
 
దిగ్భ్రాంతి కలిగించింది
సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి అకస్మిక మృతి దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
– గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌
 
ఆదర్శప్రాయుడు
దర్శకరత్న దాసరి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. సినీ రంగంలో ఎంతోమందిని ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కారణమైన ఆదర్శప్రాయుడు. దాసరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
– సీఎం కె.చంద్రశేఖర్‌రావు
 
తెలుగు సినిమా మూలస్తంభాన్ని కోల్పోయింది
దాసరి మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు సినీ రంగం మూలస్తంభాన్ని కోల్పోయింది. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
– ఏపీ సీఎం చంద్రబాబు
 
తీరని లోటు
దాసరి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. సినిమా రంగంలో ఆయన ఒక యుగకర్త. దశాబ్దాలపాటు సినీ రంగానికి పెద్ద దిక్కుగా నిలిచారు. రికార్డు స్థాయిలో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన మహా దర్శకుడు. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, పత్రికాధిపతిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినీ రంగంలో విప్లవం సృష్టించారు. కథే హీరోగా తిరుగులేని చిత్రాలు నిర్మించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
– వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
 
చిత్ర పరిశ్రమకు తీరని లోటు
ఎందరో నటులను, నటీమణులను, కళాకారులను పెంచి పోషించి, తర్ఫీదునిచ్చి చిత్ర పరిశ్రమకు అందించిన దాసరి మృతి బాధాకరం. చిత్ర పరిశ్రమకు లోటు పూడ్చలేనిది.
– కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
 
కొత్త తరాన్ని సృష్టించారు
దాసరి మృతి చిత్ర రంగానికి తీరని లోటు. సినీ, పత్రికా, రాజకీయ రంగాల్లో విశేష కృషి చేసిన ఆయన వాటిలో కొత్త తరాన్ని సృష్టించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.
– పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి
 
అజరామర కీర్తి
దాసరి మృతి తెలుగు ప్రజలకు, సినీ రంగానికి తీరని లోటు. ఉదయం పత్రిక ద్వారా బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచి ఎందరికో ఆయన మార్గదర్శకులుగా నిలిచారు. ఆయన చిత్రాలు శాశ్వతంగా నిలుస్తాయి.
– కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌
 
సినీ పరిశ్రమకు దాసరితోనే విలువ
సినీ పరిశ్రమకు శిఖరం లాంటివారు దాసరి. గొప్ప సృజన ఉన్న డైరెక్టర్‌. విప్లవాత్మక సినిమాలు తీశారు. ప్రతి సినిమాలోనూ సమాజానికి సందేశం ఇచ్చేవారు. దాసరి రాకతోనే సినీ పరిశ్రమకు ఒక విలువ వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.
– నందమూరి లక్ష్మీపార్వతి
 
పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది
ఎన్టీఆర్, అక్కినేని, దాసరి లేని సినీ పరిశ్రమను ఊహించుకోలేం. నిర్మాతల సంఘం పెద్ద దిక్కును కోల్పోయింది. సినీ రంగం వారంతా గురువు గారూ అని పిలుచుకొనే మహామనిషి ఇకలేరంటే నమ్మలేకపోతున్నాం.
– తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ చైర్మన్‌ పి.రామకృష్ణ గౌడ్‌
 
ఆయనతో నాకు చిరకాల మైత్రి
దాసరి సినీ దిగ్గజం. చిత్రసీమకు ఆయన లోటు తీర్చలేనిది. దాసరితో నాది చిరకాల మైత్రి. తాతమనుమడు చిత్రానికి ‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం’ పాట దగ్గర ఉండి నాతో రాయించుకున్నాడు. ఆ పాటతో ఆ సినిమాకు, నాకు మంచి పేరొచ్చింది. తూర్పు పడమర, ఒసేయ్‌ రాములమ్మ సినిమాల్లో టైటిల్‌ సాంగ్స్‌... ఇలా ఒకటా దాసరి సినిమాలెన్నింటికో పాటలు రాశాను. దాసరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
– డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత
 
దాసరి మృతి పట్ల డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎంపీ డి.శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి తదితరులు కూడా సంతాపం వెలిబుచ్చారు.
 
నాటక రంగమంటే ఎంతో ఇష్టం
మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న సాయిరాజు పొగాకు వ్యాపారం చేస్తూ మమ్మల్ని కష్టపడి చదివించారు. మా తమ్ముడు దాసరి నారాయణరావు చిన్నతనం నుంచే చదువుతోపాటు నాటక రంగాన్ని ప్రేమించేవాడు. మేం తిట్టినా వినిపించుకునే వాడు కాదు. ఎప్పుడూ.. ఏవో నాటకాలు రాస్తూనే ఉండేవాడు. మేం కలలో కూడా ఊహించని స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా ఉండేది. వాడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నాం.
– దాసరి రెండో అన్న సత్యనారాయణ
 
ఆయనో ఎవరెస్ట్‌..
దాసరిది తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక శకం. క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అన్నట్టుగా దాసరికి ముందు, తర్వాత అని చెప్పుకోవాలి. ఆయనో ఎవరెస్ట్‌. ఆ మహానుభావుడి మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో నాలాంటి పేద, బడుగు బలహీన వర్గాలవారి సినీ ఆశయాలను కుల, మత, ప్రాంతాలు చూడకుండా నెరవేర్చిన మహనీయుడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి అంబేద్కర్‌ ఆయన.
– ఆర్‌. నారాయణమూర్తి
 
ఎవరూ భర్తీ చేయలేరు..
నేను కోడి రామకృష్ణ శిష్యుణ్ణి. దాసరేమో కోడి రామకృష్ణ గురువు. దాసరి వద్ద పని చేయని దర్శకులు కూడా ఆయన్ను ద్రోణాచార్యునిగా ఫీలవుతారు. పరిశ్రమలో దాసరి స్థానం భర్తీ చేయడానికి ఎవరూ లేరు.
– దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌
 
అల్లు రామలింగయ్య అవార్డు అందజేసేం దుకు మే 4న దాసరి పుట్టినరోజున ఆయన ఇంటికి వెళ్లి కలిశాను. అదే ఆయన్ను చివరి సారిగా చూడటం. నా జీవితంలో ఆయన స్మృతులను ఎప్పటికీ మరవలేను. ప్రస్తుతం చైనాలో ఉన్నాను. దాసరి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరవలేనివి.
– చిరంజీవి
 
షూటింగ్‌ నిమిత్తం పోర్చుగల్‌లో ఉన్న నన్ను దాసరి మరణ వార్త షాక్‌కు గురి చేసింది. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. తెలుగు సినిమా గమనానికి కొత్త దారి చూపిన మహానుభావుడు దాసరి. మా కుటుంబానికి ఎంతో ఆత్మీయుడు.
– నందమూరి బాలకృష్ణ
 
దాసరి నాకు అత్యంత ఆత్మీయుడు, శ్రేయోభిలాషి, మంచి స్నేహితుడు. దేశంలోనే ప్రముఖ దర్శకుల్లోనే ఒకరైన ఆయన మృతి సినీ కళామతల్లికి తీరని లోటు. ఆయన కుటుంబా నికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.
– రజనీకాంత్‌
 
దాసరి మృతి తెలుగు సినిమాకు తీరని లోటు. కె.బాలచందరే దాసరిని చూసి స్ఫూర్తి పొందారు. అలాంటి దాసరి మృతికి నా ప్రగాఢ సంతాపం.
– కమల్‌హాసన్‌
 
ప్రఖ్యాత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది
– ఏఆర్‌ మురుగదాస్, సినీ దర్శకుడు
 
మాటలు రావడం లేదు. మా అంకుల్‌ ఇక లేరంటే ఆ షాక్‌లో నుంచి కోలుకోలేకపోతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
– విజయశాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement