కోచ్‌ లేనందుకే కోహ్లి అలా ఔటయ్యాడు! | Sakshi
Sakshi News home page

కోచ్‌ లేనందుకే కోహ్లి అలా ఔటయ్యాడు!

Published Sun, Jul 2 2017 9:34 AM

కోచ్‌ లేనందుకే కోహ్లి అలా ఔటయ్యాడు!

అంటిగ్వాలో వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 93 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ వన్డేలో భారత్‌ బ్యాటింగ్‌ విభాగం ఆశించినమేరకు రాణించలేదు. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. అజింక్యా రహానే మరోసారి అద్భుతంగా ఆడి 72 పరుగులు చేయగా.. మహేంద్రసింగ్‌ ధోనీ ఫామ్‌ను అందిపుచ్చుకొని అజేయంగా 78 పరుగులు చేశాడు. అనంతరం బౌలర్లు అద్భుతంగా రాణించడంతో వెస్టిండీస్‌ 158 పరుగులకే చేతులేత్తేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 11 పరుగులకే ఔటయ్యాడు.

ఇదే అదనుగా భావించిన ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌, ప్రస్తుత కామెంటేటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ కోహ్లిపై ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించాడు. కోచ్‌ లేకపోవడం వల్లే కోహ్లి ఇలా బ్యాటింగ్‌ విఫలమయ్యాడని ఎద్దేవా చేశాడు. కోహ్లితో విభేదాల కారణంగా కోచ్‌ పదవి నుంచి అనిల్‌ కుంబ్లే తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, డేవిడ్‌ లాయిడ్‌ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు, విరాట్‌ కోహ్లి అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. మొదట మీ సొంత జట్టు ఇంగ్లండ్‌ పరిస్థితి చూసుకోవాలని, పెద్ద టోర్నమెంటుల్లో విఫలమవ్వడం ఆ జట్టుకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కోచ్‌ పదవి కోసం క్యూలో నిలబడి.. కోహ్లిని ప్రసన్నం చేసుకోవాలని, అప్పుడైనా కోచ్‌గా అవకాశం దక్కవచ్చునని అతనికి సూచించారు.
.

Advertisement
Advertisement