కరాచీలోనే దావూద్ | Sakshi
Sakshi News home page

కరాచీలోనే దావూద్

Published Sun, Aug 23 2015 2:50 AM

కరాచీలోనే దావూద్

నిద్రపోతున్నాడని విలేకరికి ఫోన్‌లో చెప్పిన భార్య
దావూద్‌కు 3 పాక్ పాస్‌పోర్టులు, పాక్‌లో 9 ఇళ్లు, భార్య పేరుతో ఫోన్ బిల్లు..
భారత నిఘా వర్గాల వద్ద గట్టి ఆధారాలు

 
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని అంటున్న పాకిస్తాన్ మాటలన్నీ బుకాయింపులేనని తేలిపోయింది. అతడు పాక్‌లోని కరాచీలోనే తిష్ట వేసినట్లు నిరూపించే గట్టి ఆధారాలు వెలుగు చూశాయి. డాన్ కరాచీలో ఉన్నాడని అతని భార్య ఓ టీవీ చానల్ శనివారం చేసిన ఫోన్ కాల్‌కు బదులిచ్చింది. మరోపక్క.. దావూద్‌కు పాక్ ఇచ్చిన పాస్‌పోర్టులు, కరాచీలోని అతని భార్య పేరుతో ఉన్న ఫోన్ బిల్లు కూడా బహిర్గతమయ్యాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)తో జరపాలనుకున్న చర్చల్లో  భారత ఎన్‌ఎస్‌ఏ..ఆయనకు అందివ్వడానికి ఈ ఆధారాలు(డోసియర్) సిద్ధం చేశారు.

గడ్డం తీసేసి.. 59 ఏళ్ల దావూద్, అతని కుటుంబం పాక్‌లోని కరాచీలోనే ఉన్నట్లు తెలిపే గట్టి ఆధారాలను భారత నిఘా సంస్థలు సేకరించాయి. వీటిలో పాక్ దావూద్‌కు 1996లో ఇచ్చిన పాస్‌పోర్టు(నం. సీ-267185), ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ పాస్‌పోర్టులో దావూద్ గడ్డం లేకుండా, తలపై పల్చని వెంట్రుకలతో ఉన్నాడు. అతనికి  మరో రెండు పాక్ పాస్‌పోర్టులూ ఉన్నాయి. వీటితో తరచూ ప్రయాణాలు చేస్తున్నాడు. అతని భార్యాపిల్లలకూ, ఇద్దరు సోదరులకూ పాక్ పాస్‌పోర్టులు ఉన్నాయి. దావూద్ భార్య మెహజబీన్ షేక్ పేరుతో ఉన్న ఏప్రిల్, 2015 నాటి టెలిఫోన్ బిల్లు మరో ఆధారం. అందులో ఫోన్ చిరునామాను ‘డి-13, బ్లాక్-4, కరాచీ డెవలప్‌మెంట్ అథారిటీ, ఎస్‌సీహెచ్-5, క్లిఫ్టన్’గా పేర్కొన్నారు. దావూద్ దంపతులతోపాటు వారి కొడుకు మొయీన్, కూతుళ్లు మెహ్రుఖ్, మెహ్రీన్, మాజియాలు కూడా పాక్‌లో ఉన్నారని, వారు కరాచీ-దుబాయ్ మధ్య ప్రయాణాలు చేస్తున్నారని కూడా తెలిసింది. మెహ్రుఖ్‌ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునాయిద్ పెళ్లి చేసుకున్నాడు. మెహజబీన్, మాజియాలు ఈ ఏడాది జనవరి 4న విమానంలో కరాచీ నుంచి దుబాయ్ వెళ్లారు.  దావూద్ సన్నిహితులైన జబీర్ సిద్దిక్, జవైద్ చోటానీ, ముంబై పేలుళ్ల నిందితుడు జావేద్‌పటేల్ అలియాస్ చిక్నా తదితరులు కూడా పాక్‌లో ఉన్నారని నిఘా వర్గాలు కనిపెట్టాయి. డీ-కంపెనీ పాక్‌లోనే ఉన్నా భారత్‌లో బలవంతపు వసూళ్లు వంటి నేరాలకు పాల్పడుతోందని  నిఘా వర్గాలు చెబుతున్నాయి.

పాక్‌లో 9 ఇళ్లు..
దావూద్‌కు పాక్‌లో 9 ఇళ్లు ఉన్నట్లు భారత్‌కు ఆధారాలు లభించాయి. డాన్ రెండేళ్ల కిందట కరాచీ క్లిఫ్టన్‌లో ఒక ఇళ్లు కొన్నాడు. అది పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడు బిలావల్ ఇంటికి దగ్గర్లోనే ఉంది. ఈ ఇంటితోపాటు, క్లిఫ్టన్‌లోనే ఐదు ఇల్లు, నగరంలో ఐఎస్‌ఐ సురక్షిత స్థావరమైనడిఫెన్స్ హౌసింగ్ ఏరియాలో మరో ఇల్లు, ఇస్లామాబాద్‌లో రెండిళ్లు ఉన్నాయి. అతడు పాక్‌లో చాలా ఆస్తులు కూడబెట్టాడని, పాక్ భద్రతా సంస్థ రక్షణలో ఉన్నాడని భారత డోసియర్‌లో పేర్కొన్నారు. కాగా, తాజా ఆధారాలపై హోం మంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. దావూద్ పాక్‌లో పలుచోట్ల స్థావరాలు మారుస్తున్నా ఆ దేశంలోనే ఉన్నాడని స్పష్టం చేశారు.
 
‘ఆయన నిద్రపోతున్నారు..’

దావూద్ భార్య మెహజబీన్ షేక్ పేరుతో ఉన్న టెలిఫోన్ నంబర్ ఆధారంగా టైమ్స్ నౌ టీవీ చానల్ విలేకరి శనివారం కరాచీలోని మెహజబీన్‌కు  ఫోన్ చేయగా, డాన్ అక్కడే ఉన్నట్లు తేలింది. ఫోన్ సంభాషణ ఇలా సాగింది.
 
తొలి ఫోన్ కాల్..
విలేకరి: వాలేకుమ్ అస్సలామ్: నేను మెహజబీన్ షేక్‌తో మాట్లాడొచ్చా?
మెహజబీన్: ఎస్. నేను మెహజబీన్నే. మీరెవరు?
విలేకరి: మేడమ్, మీరు కరాచీ నుంచే మాట్లాడుతున్నారా?
మెహజబీన్: ఎస్.
విలేకరి: మేడమ్, మీరు దావూద్ ఇబ్రహీమ్ భార్యేనా?
మెహజబీన్: అవును, ఆయన నిద్రపోతున్నారు.
రెండో ఫోన్ కాల్..
విలేకరి: నేను దావూద్‌తో మాట్లాడాలి, ఆయన అక్కడున్నారా?
మెహజబీన్: నాకు తెలియదు. తర్వాత ఫోన్ చేయండి(కాల్  కట్ అయింది)

Advertisement
Advertisement