కేజ్రీవాల్కు కేంద్ర హోంశాఖ చెక్ | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్కు కేంద్ర హోంశాఖ చెక్

Published Mon, Jan 20 2014 12:33 PM

కేజ్రీవాల్కు కేంద్ర హోంశాఖ చెక్

న్యూఢిల్లీ: తమ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలనుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కేంద్ర హోంశాఖ చెక్ పెట్టింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేసేందుకు బయలు దేరిన కేజ్రీవాల్‌తో సహా అతని మంత్రివర్గ సభ్యులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లను ముందుకు కదలనివ్వలేదు. రైల్‌ భవన్‌ వద్దనే నిలిపేశారు. వెనక్కి పంపడానికి పోలీసులు ప్రయత్నించారు.

అయితే, మనీష్‌ శిసోడియా, సోమ్‌నాథ్‌ భారతి అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించారు. 'మేం ధర్నా చేయడానికి బయలుదేరాం.. మమ్ముల్ని అడ్డుకుంటే.. ఇక్కడే నడిరోడ్డు మీదే ధర్నాకు కూర్చుంటాం' అని ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి సోమ్‌నాథ్‌ భారతి ఢిల్లీ పోలీసులను హెచ్చరించారు.

కేజ్రీవాల్‌లో పాటు ఆయన మంత్రి వర్గ సభ్యులు అవసరమైతే నార్త్‌ బ్లాక్‌ వద్ద ధర్నా చేసుకోవచ్చని పోలీసులు సూచించారు. హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేను కూడా కలుసుకోవడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే కేజ్రీవాల్‌ అతని మంత్రి వర్గ సభ్యులు రైల్‌ భవన్‌ నుంచి కదలడానికి నిరాకరించారు. అక్కడే ప్రసంగాలు కూడా కొనసాగించారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మరికొంత మంది నినాదాలు చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించడంతో పాటు, మంత్రులను కూడా ధిక్కరించినందుకు ఢిల్లీ పోలీసులపై చర్య తీసుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అయితే విచారణ తర్వాతే పోలీసులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు.

Advertisement
Advertisement