డెరివేటివ్స్, ఆర్‌బీఐ ఎఫెక్ట్! | Sakshi
Sakshi News home page

డెరివేటివ్స్, ఆర్‌బీఐ ఎఫెక్ట్!

Published Mon, Sep 23 2013 12:56 AM

డెరివేటివ్స్, ఆర్‌బీఐ ఎఫెక్ట్! - Sakshi

న్యూఢిల్లీ: ఓవైపు డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు, మరోవైపు రెపో రేటు పెంపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)లో సెప్టెంబర్ నెలకు డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు గురువారం(26న) ముగియనుంది. ఇక గడిచిన శుక్రవారం(20న) రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ అనూహ్య రీతిలో రెపో రేటును 0.25%మేర పెంచిన సంగతి తెలిసిందే. ఈ రెండు అంశాల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూడవచ్చునని అభిప్రాయపడ్డారు.
 
 అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ యథాతథ కొనసాగింపు వార్తలతో ఏర్పడ్డ  బుల్లిష్ సెంటిమెంట్‌ను రాజన్ చేపట్టిన రెపో పెంపు నిర్ణయం దెబ్బకొట్టిందని చెప్పారు. ఇటీవల అదుపు తప్పుతున్న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణాన్ని(డబ్ల్యూపీఐ) కట్టడిలో ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ తాజా పాలసీ సమీక్షలో రెపో రేటును 7.25% నుంచి 7.5%కు పెంచింది. ఆగస్ట్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 9.52%కు చేరగా, డబ్ల్యూపీఐ 6%ను అధిగమించడంతో మార్కెట్ అంచనాలకు విరుద్ధంగా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంపునకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే రూపాయికి బలాన్నిచ్చేందుకు వీలుగా కఠిన లిక్విడిటీ విధానాలను కొంతమేర సరళీకరించింది. కాగా, ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో శుక్రవారం సెన్సెక్స్ 383 పాయింట్లు పతనమైంది. అయితే అంతకుముందు ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న యథాతథ పాలసీ నిర్ణయాలతో 684 పాయింట్లు జంప్ చేసింది.
 
  నెలకు 8,500 కోట్ల డాలర్లతో అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలను కొనసాగించేందుకు నిర్ణయించడం ద్వారా ఫెడరల్ రిజర్వ్... పరోక్షంగా రిజర్వ్ బ్యాంక్‌ను మేలు చేసిందని కాప్రి గ్లోబల్ క్యాపిటల్ ఎండీ పీహెచ్ రవికుమార్ వ్యాఖ్యానించారు. తద్వారా కనీసం మూడు నెలలపాటు దేశీయ విధాన కర్తలకు కీలక నిర్ణయాలలో వెసులుబాటును తీసుకునే అవకాశాన్ని కల్పించిందని పేర్కొన్నారు.  
 
 కన్సాలిడేషన్ దిశలో...: ఫెడరల్ రిజర్వ్, ఆర్‌బీఐ నిర్ణయాలు వెలుడటంతోపాటు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ముగింపు నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనవుతాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ పేర్కొన్నారు. సమీప కాలంలో నిఫ్టీ 5,800-6,150 పాయింట్ల మధ్య స్థిరీకరణ(కన్సాలిడేషన్) చెందే అవకాశమున్నదని చెప్పారు. తద్వారా రానున్న కాలంలో ఏదైనా ఒక ట్రెండ్‌లో సాగేందుకు అవసరమైన బేస్‌ను ఏర్పరచుకుంటుందని అంచనా వేశారు.
 
 విదేశీ పెట్టుబడులపై చూపు
 దేశీయ స్టాక్ మార్కెట్లు విదేశీ పెట్టుబడులపై అత్యధికంగా దృష్టిసారిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు అంతర్జాతీయ పరిస్థితులను సైతం పరిగణనలోకి తీసుకుంటాయని తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) రూ. 11,000 కోట్లను(170 కోట్ల డాలర్లు) మన మార్కెట్లలో ఇన్వెస్ట్‌చేయడం గమనార్హం. 

Advertisement
Advertisement