Sakshi News home page

డివిలియర్స్‌ షాకింగ్‌ ప్రకటన!

Published Mon, Jun 26 2017 10:49 AM

డివిలియర్స్‌ షాకింగ్‌ ప్రకటన!

రిటర్మెంట్‌పై ఆగస్టులో వెల్లడిస్తానంటూ కామెంట్‌

కార్డిఫ్‌: దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ షాకింగ్‌ ప్రకటన చేశాడు. తాను ఇక అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేది లేనిది ఆగస్టులో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు. బ్యాటింగ్‌ దిగ్గజాల్లో ఒకరిగా పేరొందిన 33 ఏళ్ల డివిలియర్స్‌ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో సఫారీ జట్టు నిరాశాజనకంగా మొదటిరౌండ్‌లోనే వెనుదిరిగింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ, టీ-20 సిరీస్‌లోనూ పరాభవాన్ని మూటగట్టుకుంది. 2-1తేడాతో టీ-20 సిరీస్‌ను ఇంగ్లండ్‌కు కోల్పోవడంతో ఇంటిముఖం పట్టిన డివిలియర్స్‌ ఈ సందర్భంగా ఒకింత ఉద్వేగంగా మాట్లాడాడు. ఆగస్టులో తన క్రికెట్‌ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.

అయితే, చాలాకాలంగా ఇది తాను అనుకుంటున్న విషయమేనని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మెట్లలో ఆడటం, ఐపీఎల్‌ వంటి పలు టీ-20 ఫ్రాంచైజీల్లో డిమాండింగ్‌ ప్లేయర్‌గా ఉండటంతో ఎదురవుతున్న పని ఒత్తిడి నుంచి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్టు అన్నాడు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు రానుంది. అప్పటిలోగా తన క్రికెట్‌ భవిష్యత్తు ఏమిటో తేలిపోనుందని చెప్పాడు. ‘నేను ఆగస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డుతో భేటీ అయి నా (అంతర్జాతీయ క్రికెట్‌) భవిష్యత్తుపై చర్చిస్తాను’  అని ఆయన విలేకరులతో వెల్లడించాడు.

బోర్డుకు, తనకు మధ్య ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. కొన్ని మ్యాచ్‌లు ఆడటం.. విశ్రాంతి తీసుకోవడం అన్న తరహాలో కాకుండా రానున్న సంవత్సరాల్లో ఏం చేయాలనేవిధంగా తుది నిర్ణయం ఉండబోతునన్నదని డివిలియర్స్‌ తెలిపాడు. దక్షిణాఫ్రికాకు వరల్డ్‌ కప్‌ అందించాలన్నది తన కల అని, అయితే, అది తాను జట్టులో భాగంగా ఉండి అందించవచ్చు లేదా పరోక్షంగా సేవలు అందించి కావొచ్చునని చెప్పాడు. 106 టెస్టులు ఆడిన డివిలియర్స్‌ 21 సెంచరీలతో 8వేలకుపైగా పరుగులు చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement