రెండో రాజధాని.. సీఎం అనూహ్య నిర్ణయం | Sakshi
Sakshi News home page

రెండో రాజధాని.. సీఎం అనూహ్య నిర్ణయం

Published Fri, Jan 20 2017 9:12 AM

రెండో రాజధాని.. సీఎం అనూహ్య నిర్ణయం

ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ధర్మశాలను తమ రాష్ట్రానికి రెండో రాజధానిగా ఆయన ప్రకటించారు. 70 లక్షల జనాభా ఉన్న అతి చిన్న రాష్ట్రానికి రెండో రాజధానిని ప్రకటించడం ద్వారా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ధౌలాధర్ పర్వతశ్రేణిలో ఉన్న ధర్మశాల చాలా అద్భుతమైన ప్రాంతమని, దీనికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉన్నందున రాష్ట్రానికి రెండో రాజధాని అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని ఆయన చెప్పారు. 
 
హిమాచల్ ప్రదేశ్‌లోని దిగువ ప్రాంతాలైన కాంగ్రా, చంబా, హమీర్‌పూర్, ఉనా జిల్లాలకు ధర్మశాల చాలా ముఖ్యమైన ప్రాంతం. పైగా, రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ సీట్లలో 25 ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. దాంతో ఇక్కడకు ఒక రాజధాని నగరాన్ని ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతవాసులను ఆకట్టుకోవాలన్నది సీఎం వ్యూహంలా కనిపిస్తోంది. రాజధాని నగరంలో పనులు చేసుకోవాలంటే షిమ్లా వరకు దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని, తమకు దగ్గర్లోనే ఉన్న ధర్మశాలలో ఆ పనులు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. దలైలామా ఆశ్రమం ఉండటం, ప్రకృతి అనుకూలత, అడ్వంచర్ టూరిజానికి కేంద్రం కావడం.. ఇలా పలు రకాలుగా ధర్మశాల ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయంగా పేరు పొందింది. ఇప్పుడు రాష్ట్రానికి రెండో రాజధాని హోదా రావడంతో మరింత ముందుకెళ్తుంది.

Advertisement
Advertisement