థ్రిల్లర్‌: 'దొంగ' చైనీయులు ఎలా దొరికారంటే! | Sakshi
Sakshi News home page

థ్రిల్లర్‌: 'దొంగ' చైనీయులు ఎలా దొరికారంటే!

Published Wed, Aug 2 2017 9:32 AM

థ్రిల్లర్‌: 'దొంగ' చైనీయులు ఎలా దొరికారంటే! - Sakshi

ముంబై: ఇద్దరు చైనీయులు తమ అతి తెలివితో చేతివాటం ప్రదర్శించబోయి అడ్డంగా దొరికిపోయారు. ముంబై గోరేగావ్‌లో జరుగుతున్న వజ్రాల ప్రదర్శనకు హాజరైన ఈ ప్రబుద్ధులు..  రూ. 34 లక్షల విలువైన వజ్రాన్ని దొంగలించారు. ఎవరికీ అనుమానం రాకుండా అసలైన వజ్రాన్ని దొంగలించి.. దాని స్థానంలో నకిలీది పెట్టి ఉడాయించారు. వెంటనే ఢిల్లీ మీదుగా హాంగ్‌కాంగ్‌ చెక్కేసేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకొన్నారు. మరికాసేపైతే చైనా దొంగలు తప్పించుకొనే వాళ్లే.. కానీ సీఐఎస్‌ఎఫ్‌, ఇమ్మిగ్రేషన్‌ మొదలు విమానాశ్రయం భద్రతా అధికారుల వరకు వివిధ ఏజెన్సీలు అత్యంత సమన్వయంతో వ్యవహరించడంతో చైనీయులు చివరిక్షణంలో ఎయిర్‌పోర్టులో దొరికిపోయారు. ఓ చిన్ని షాంపూ బాటిల్‌లో దాచిన 5.4 క్యారెట్ల వజ్రాన్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వివిధ ఏజెన్సీలు సమన్వయంగా వ్యవహరించి ఛేదించిన ఈ కేసులో వాట్సాప్‌ వంటి మొబైల్‌ యాప్స్‌ బాగా ఉపయోగపడ్డాయి.

గత నెల 27 నుంచి 31 వరకు గోరేగావ్‌లో ఇండియా ఇంటర్నేషనల్‌ జుయల్లరీ షో-2017 జరిగింది. ఈ షోలోకి ఎంట్రీకి రూ. 9వేలు టికెట్‌గా నిర్ణయించారు. చివరిరోజు సోమవారం ఈ ప్రదర్శనకు వచ్చిన ఇద్దరు చైనీయులు పీ కీర్తిలాల్‌ అండ్‌ కో స్టాల్‌లో తెలివిగా వజ్రాన్ని కొట్టేసి.. దానిస్థానంలో నకిలీది పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన నిర్వాహకులు మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో ఈ ప్రదర్శనకు భద్రత అందిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌)కు సమాచారం.

నిర్వాహకులు ఇచ్చిన సమాచారాన్ని, సీసీ కెమెరాల్లోని చైనీయుల దృశ్యాలను వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ..వాట్సాప్‌ ద్వారా పోలీసులకు, ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు పంపించింది. అదేవిధంగా ఫారెనర్‌ రిజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో)కు, ఎయిర్‌పోర్టు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌కు కూడా సమాచారాన్ని పంపించారు. దీంతో అత్యంత సమన్వయంగా వ్యవహరించిన ఈ ఏజెన్సీల అధికారులు సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో ముంబై ఎయిర్‌పోర్టులో ఇద్దరు చైనీయులను గుర్తించారు. వారు రాత్రి 7.45 గంటలకు ఢిల్లీ మీదుగా హాంగ్‌కాంగ్‌ వెళ్లే విమానం కోసం వచ్చారు. వెంటనే వారిని అరెస్టు చేసిన ఎయిర్‌పోర్ట్‌ భద్రతా సిబ్బంది.. వారి వద్ద నుంచి దొంగలించిన వజ్రాన్ని స్వాధీనం చేసుకుంది.
 

Advertisement
Advertisement