‘దిల్‌సుఖ్‌నగర్‌’ దోషులకు 19న శిక్షలు ఖరారు | Sakshi
Sakshi News home page

‘దిల్‌సుఖ్‌నగర్‌’ దోషులకు 19న శిక్షలు ఖరారు

Published Wed, Dec 14 2016 3:17 AM

‘దిల్‌సుఖ్‌నగర్‌’ దోషులకు 19న శిక్షలు ఖరారు - Sakshi

- ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారణ
- ఐదుగురు నిందితులపైనా నేరం నిరూపణ
- పరారీలో సూత్రధారి రియాజ్‌ భత్కల్‌
- వచ్చే సోమవారం శిక్షలు ఖరారు
- ఇండియన్‌ ముజాహిదీన్‌ కేసుల్లో నేరం రుజువైన తొలి కేసు


సాక్షి, హైదరాబాద్‌

రాజధానిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురూ దోషులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు మంగళవారం నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. దోషులకు వచ్చే సోమవారం (19న) శిక్షలు ఖరారు చేయనున్నారు. ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థ దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడిన తొలి కేసు ఇదే! తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో కోర్టు ఉన్న చర్లపల్లి జైలు వద్ద మంగళవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌లో తలదాచుకున్న రియాజ్‌ భత్కల్‌ ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్‌ అహ్మద్‌ సిద్ధిబప్ప అలియాస్‌ యాసీస్‌ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హడ్డీ, జియావుర్‌ రెహ్మాన్‌ అలియాస్‌ వకాస్‌ (పాకిస్తానీ), మహ్మద్‌ తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ మోను, ఎజాజ్‌ షేక్‌ పాలుపంచుకున్నారని ఎన్‌ఐఏ తేల్చింది. విధ్వంసంలో యాసీన్‌ భత్కల్‌ నేరుగా పాల్గొననందున అతణ్ని ఐదో నిందితుడిగా చేర్చింది.

దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్‌ వద్ద జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా ఏకంగా 131 మంది క్షతగాత్రులవడం తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్, ఇప్పటి రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్‌ ఠాణాల్లో కేసులు నమోదవగా, అనంతరం వాటిని ఎన్‌ఐఏకు బదలాయించారు. ఈ రెండు కేసులకు కీలక ప్రాధాన్యమిచ్చిన ఎన్‌ఐఏ అధికారులు 157 మంది సాక్షులతో పాటు 502 డాక్యుమెంట్లు, 201 ఆధారాలను కోర్టు ముందుంచారు. నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 10, 16, 17, 19, 20, ఐపీసీ 120 (బి), 302, 307, 324, 326, 316, 121, 121 (ఎ), 122, 474, 466, పేలుడు పదార్థాల చట్టం 3, 5 సెక్షన్ల కింద ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు దోషులుగా తేలగా, పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్‌ భత్కల్‌పై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసింది.

కేసులో ‘ప్రత్యేకత’లెన్నో
దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో అనేక ‘ప్రత్యేకతలు’న్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ అధికారులు పట్టుకున్నారు. వీరిపై దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఉగ్రవాదుల్ని ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చారు. అలాగే వారిని మిగతా రాష్ట్రాలకూ తీసుకెళ్లాల్సి ఉంది. కానీ ప్రాధాన్యం దృష్ట్యా ఇక్కడి కేసుల విచారణ పూర్తయ్యేదాకా వారిని మరో ప్రాంతానికి తరలించే ఆస్కారం లేకుండా తెలంగాణ సర్కారు 2014లో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ముష్కరుల్ని చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉంచారు. కేసు విచారణ తొలుత ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయస్థానంలో జరిగింది. భద్రతా కారణాలతో పాటు విచారణ త్వరిగతగతిన పూర్తి చేయడానికి చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఓ సందర్భంలో ఐసిస్‌ ఉగ్రవాదుల సాయంతో యాసీన్‌ భత్కల్‌ తప్పించుకునే అవకాశం ఉందనే హెచ్చరికలు వెలువడ్డాయి. దీంతో జైలు వద్ద నిత్యం ఆక్టోపస్‌ కమాండోల పహారా ఏర్పాటు చేశారు. ఈ పేలుడులో మరణించిన 17 మందిలో ఓ మహిళ గర్భవతి. గర్భస్థ శిశువును హత్య చేయడం నేరమేనంటూ మృతుల సంఖ్యను 18గా దర్యాప్తు అధికారులు నిర్థారించారు.

దేశంలోనే తొలి కేసుగా రికార్డు
దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడటానికి ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌గా (ఏఆర్‌సీఎఫ్‌) ఏర్పడిన ఉగ్రవాద బృందం ఆపై రియాజ్‌ భత్కల్‌ నేతృత్వంలో ‘ఉసాబా’గా పేరు మార్చుకుంది. 2002లో ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మారి తొమ్మిది రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పేలుళ్లకు పాల్పడింది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, వారణాసి... ఇలా వీరు విరుచుకుపడని మెట్రో, నగరం లేవు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు, గోకుల్‌ చాట్‌ల్లోనూ విధ్వంసం సృష్టించింది ఐఎం ఉగ్రవాదులే. 2007 నవంబర్‌ 25న వారణాసి కోర్టుల్లో పేలుడుకు పాల్పడిన ఈ ముష్కరులు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు మీడియాకు ఈ–మెయిల్‌ పంపారు. అప్పుడే తొలిసారిగా ఐఎం పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలో ఉన్నదెవరు, దాన్ని నడిపిస్తున్నదెవరనే అంశాలు మరో ఏడాది దాకా బయట పడలేదు. 2008 సెప్టెంబర్‌లో ఢిల్లీలోని జామియానగర్‌లో ఉన్న బాట్లా హౌస్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అక్కడ దొరికిన ముష్కరుల విచారణతో ఐఎం గుట్టు రట్టయింది. అంతకుముందు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఐఎంపై 60 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అరెస్టయ్యారు. 2007 నాటి హైదరాబాద్‌ జంట పేలుళ్లతో పాటు అన్ని కేసులూ పలు కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఐఎం ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తై, నిందితులను దోషులుగా తేల్చిన తొలి కేసుగా దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు రికార్డుకెక్కాయి. వచ్చే సోమవారం శిక్షలు ఖరారు చేస్తే, శిక్షలు పడిన తొలి కేసుగానూ ఇదే నిలుస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement