‘గగన్’ ప్రారంభం | Sakshi
Sakshi News home page

‘గగన్’ ప్రారంభం

Published Tue, Jul 14 2015 2:05 AM

‘గగన్’ ప్రారంభం

దేశీయ నావిగేషన్ వ్యవస్థను ప్రారంభించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
 
న్యూఢిల్లీ: భారత ఉపఖండ ప్రాంతంలో విస్తృతమైన నావిగేషన్ సౌకర్యాన్ని కల్పించే.. దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో అగుమెంటెడ్ నావిగేషన్)’ పని ప్రారంభించింది. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సోమవారం దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. బంగాళాఖాతం, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల నుంచి ఆఫ్రికా వరకు పనిచేసే  వ్యవస్థను ఇస్రో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేశాయి. రూ.774 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో పలు కృత్రిమ ఉపగ్రహాలనూ ప్రయోగిస్తోంది.

గత ఏడాదే ప్రయోగించిన‘జీశాట్-8, జీశాట్-10’ శాటిలైట్లు నావిగేషన్ సిగ్నల్స్‌ను పంపుతున్నాయి. ఈ నావిగేషన్ వ్యవస్థ సైనిక, పౌర విమాన సర్వీసులను సమర్థవంతంగా నిర్వహించేందుకు, వ్యయాలను తగ్గించేందుకు, భద్రతకు తోడ్పడుతుంది. ‘గగన్’ను ఆవిష్కరించిన అనంతరం అశోక్‌గజపతిరాజు మాట్లాడారు. రవాణా, వ్యవసాయం తదితర అవసరాలకూ ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ‘గగన్’ను ప్రారంభించడంతో ఇప్పటికిప్పుడు 50 విమానాశ్రయాలకు ప్రయోజనకరమని, సార్క్ దేశాలన్నీ కూడా ఈ నావిగేషన్‌ను వినియోగించుకోవచ్చని పౌర విమానయానశాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే చెప్పారు.

Advertisement
Advertisement