భారత్‌, చైనాను బూచిగా చూపి.. | Sakshi
Sakshi News home page

భారత్‌, చైనాను బూచిగా చూపి..

Published Fri, Jun 2 2017 9:07 AM

భారత్‌, చైనాను బూచిగా చూపి.. - Sakshi

- పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా
- భూతాప నియంత్రణకు కొత్త విధానం తెస్తామన్న ట్రంప్‌
- అగ్రరాజ్యనిర్ణయంతో ప్రపంచ పర్యావరణానికి పెను విఘాతం


వాషింగ్టన్‌:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూతాపం నియంత్రణకు వీలుగా 2015లో కుదుర్చుకున్న పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇదిగో, అదిగో అంటూ ఊరించిన ట్రంప్‌..  గురువారం సాయంత్రం తన వైఖరిని వెల్లడించారు. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ పర్యావరణానికి తీవ్ర విఘాతం వాటిల్లినట్లయింది. ట్రంప్‌ వైఖరిపై పలు దేశాలు, సంస్థలు మండిపడుతున్నాయి.

భారత్‌,చైనాలను బూచిగా చూపి..
పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగడానికి భారత్‌, చైనాలను బూచిగా చూపే ప్రయత్నం చేశారు డొనాల్డ్‌ ట్రంప్‌. సదరు ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని, ఉద్యోగ, ఉపాధి రంగాలను దెబ్బతీస్తుందన్న ట్రంప్‌.. భారత్‌, చైనా లాంటి దేశాలకు మాత్రం ఇది అనుకూలంగా ఉందని పేర్కొనడం గమనార్హం. అమెరికాకు మేలు చేయని ఏ ఒప్పందం విషయంలోనైనా తన వైఖరి ఇలానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అసలేమిటీ ఒప్పందం?
నానాటికీ పెరిగిపోతున్న భూతాపాన్ని నియంత్రించేందుకుగానూ 2015లో పారిస్‌లో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం దీని ప్రకారం భూగోళపు సగటు ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్సియస్‌ కన్నా కింది స్థాయికి తగ్గించాలి. అమెరికా సహా 187 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే, నాటి అధ్యక్షుడు ఒబామా అనాలోచితంగా పారిస్‌ ఒప్పందంలో భాగస్వామి అయ్యారని, తాము అధికారంలోకి వస్తే ఒప్పందం నుంచి వైదొలుగుతామని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అన్నట్లుగానే ఇప్పుడు పారిస్‌ ట్రిటీ నుంచి బయటికొచ్చేశారు. ఈ నేపథ్యంలో ఒప్పందం అమలు చేయించాల్సిన బాధ్యతను ఎవరు తలకెత్తుకుంటారో వేచిచూడాలి.

పారిస్‌ ఒప్పందంలోని కీలక అంశాలు..

  • పెరుగుతున్న భూగోళం ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువకి అదుపు చేయాలి, అవసరమైతే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసేందుకు మరింతగా కృషి చేయాలి.
  • వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలపై ఐదేళ్ళకోసారి జాతీయ సమీక్ష జరగాలి.
  • అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు పరస్పరం సహకరించుకోవాలి.
  • వర్ధమాన దేశాలకు సాయంగా 2020 నుండి ఏడాదికి వంద బిలియన్ల డాలర్లు చొప్పున అగ్రదేశాలు నిధులు అందచేయాలి.
  • నిధులు పొందే దేశాలు.. అసలు లక్ష్యంవైపు పయనిస్తున్నాయా? లేదా? అనేదానిపై ప్రతి ఐదేళ్లకోసారి సమీక్ష జరగాలి.

Advertisement
Advertisement