వెండితెరకు ‘మత్తు’ మరక.. | Sakshi
Sakshi News home page

వెండితెరకు ‘మత్తు’ మరక..

Published Fri, Jul 14 2017 4:02 AM

వెండితెరకు ‘మత్తు’ మరక.. - Sakshi

- సినీరంగ ప్రముఖులకు ఎక్సైజ్‌ శాఖ నోటీసులు
- ప్రచారంలో ఇద్దరు బడా దర్శకులు, ఇద్దరు నిర్మాతల పేర్లు
- ఓ ఐటం సాంగ్‌ నర్తకి, గతంలో అగ్రశ్రేణి హీరోయిన్‌ కూడా..
- ఇటీవలే విడుదలైన సినిమాలో ప్రముఖ నటుడి పేరు.. ఇద్దరు వర్ధమాన హీరోలకూ నోటీసులు!
- డ్రగ్స్‌ వ్యాపారి కెల్విన్‌ ఫోన్‌ కాల్‌డేటా విశ్లేషణతో గుట్టురట్టు


సాక్షి, హైదరాబాద్‌

డ్రగ్స్‌ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. డ్రగ్స్‌ వ్యాపారి కెల్విన్‌ సెల్‌ఫోన్‌ కాల్‌డేటా విశ్లేషణలో పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వస్తున్నాయి. గడచిన ఏడాది కాలంగా కెల్విన్‌ నుంచి డ్రగ్స్‌ అందుకుంటున్న వారి వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఛేదించింది. ఇప్పటివరకు అధికారులు ఎవరి పేరు ప్రకటించకున్నా.. పలువురిపై జోరుగా ప్రచారం సాగుతోంది. వారిలో ఇద్దరు బడా దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఇటీవలే విడుదలైన ఓ సినిమాలోని ప్రముఖ నటుడి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు గతంలో అగ్రశ్రేణి కథానాయికగా పేరొందిన ఓ హీరోయిన్‌తోపాటు ఐటం సాంగ్‌లో నర్తించే ఓ నటి, ఇద్దరు వర్ధమాన హీరోలు, క్యారెక్టర్‌ ఆర్టి్టస్టుగా నిలదొక్కుకున్న ఓ నటుడు, సినిమా నేపథ్య గాయని భర్త, ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మరికొందరికి అధికారులు నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ‘సాక్షి’ప్రతినిధి ఎక్సైజ్‌ అధికారుల వివరణ కోరగా వారు ధ్రువీకరించ లేదు.. ఖండించనూ లేదు. నోటీసులు అందుకున్న వారంతా ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్‌ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నట్లు మాత్రం వెల్లడించారు.

డొంక ఎలా కదిలిందంటే..
ఇటీవల పట్టుబడిన డ్రగ్‌ వ్యాపారి కెల్విన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో సినీ రంగానికి సంబంధించిన వారికి డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు తెలిపాడు. కానీ వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో అధికారులు అతడి కాల్‌డేటాపై దృష్టి సారించారు. కెల్విన్‌ మొబైల్‌లో మొత్తం 1246 నంబర్లు ఫీడ్‌ చేసి ఉండగా.. కాల్‌డేటాలో అనుమానాస్పదంగా ఉన్న 48 నంబర్లను విశ్లేషించారు. దీంతో సినీ రంగానికి చెందిన కొందరి వివరాలను తెలుసుకోగలిగారు. ఇప్పటికే వారిలో కొందరిని రహస్యంగా విచారించారు. వారి కాల్‌డేటాను కూడా విశ్లేషించగా.. అందులో ప్రముఖుల ఫోన్‌ నంబర్లు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే వారంతా డ్రగ్స్‌ తీసుకుంటున్నారా? లేదా మాదకద్రవ్యాల క్రయవిక్రయాల్లో పాలుపంచుకుంటున్నారా అన్న అంశాన్ని లోతుగా విచారిచేందుకే నోటీసులు జారీచేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ సినీ ప్రముఖుల వివరాలను వెల్లడించబోమని స్పష్టంచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement