హైదరాబాద్‌లో ఈజీ వాష్ కేర్ లాండ్రీ సర్వీసులు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఈజీ వాష్ కేర్ లాండ్రీ సర్వీసులు

Published Fri, Oct 30 2015 1:36 AM

హైదరాబాద్‌లో ఈజీ వాష్ కేర్ లాండ్రీ సర్వీసులు

వ్యవస్థీకృత రంగంలో రాష్ట్రంలో తొలి కంపెనీ
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవస్థీకృత రంగంలో లాండ్రీ సర్వీసులు అందించే హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్ ఈజీవాష్‌కేర్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈజీ వాష్ కేర్ పేరుతో తొలి కేంద్రాన్ని ఇక్కడి మాదాపూర్‌లో ఏర్పాటు చేసింది. బట్టలు ఉతకడమేగాక ఇస్త్రీ చేసి మరీ కస్టమర్‌కు అప్పగిస్తారు. కంపెనీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వెళ్లి దుస్తులను సేకరించి, తిరిగి డెలివరీ చేస్తారు. సెప్టెంబరులో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇటీవలే వాణిజ్యపరంగా కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఇప్పటికే 750కిపైగా కస్టమర్లున్నారని కంపెనీ వ్యవస్థాపకులు కలిశెట్టి నాయుడు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. కస్టమర్ల సౌకర్యార్థం మొబైల్ యాప్‌ను త్వరలో తీసుకొస్తామన్నారు. ఏడాదిలో నాలుగు కేంద్రాలు..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూఎస్ కంపెనీ మేట్యాగ్ వాషింగ్ మెషీన్లను భారత్‌లో తొలిసారిగా తాము వినియోగిస్తున్నామని కలిశెట్టి నాయుడు చెప్పారు. ‘బట్టలు ఉతకడానికి ట్రీటెడ్ వాటర్‌తోపాటు నాణ్యమైన డిటర్జంట్, కండీషనర్, కలర్ బ్లీచ్‌ను వాడుతున్నాం. చార్జీలు ప్యాక్‌నుబట్టి రూ.999 నుంచి ప్రారంభం. ఇక రూ.2,999 ప్యాక్‌లో ఒక కుటుంబానికి నెలంతా సేవలందిస్తాం. ఈ ప్యాక్‌లో ఉన్నవారికి ఎనమిదిసార్లు బట్టలు సేకరించి డెలివరీ చేస్తాం. ప్రస్తుతం ఆరు మెషీన్లను దిగుమతి చేసుకున్నాం. అధిక సామర్థ్యమున్న మెషీన్లు మరిన్ని రానున్నాయి. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఏడాదిలో నాలుగు కేంద్రాలు ప్రారంభిస్తాం’ అని తెలిపారు.
 

Advertisement
Advertisement