యూపీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా ఇదే.. | Sakshi
Sakshi News home page

యూపీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా ఇదే..

Published Mon, Jan 9 2017 3:06 PM

యూపీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా ఇదే.. - Sakshi

దేశంలోని రాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో పిల్లల జనాభా కూడా అత్యధికమే. రాష్ట్రంలో దాదాపు 20 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో నాలుగోవంతు మంది 5- 14 ఏళ్ల లోపు పిల్లలే ఉన్నారు. అయితే వారిలో ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు వెళ్లే పిల్లల సంఖ్య బాగా తక్కువ. విద్యార్థులకు ఉండాల్సిన నిష్పత్తి కన్నా టీచర్ల సంఖ్య కూడా బాగా తక్కువ. నేర్చుకునే సామర్థ్యం కూడా వారిలో తక్కువ. బడికి పోయే వారిలో పనికిపోయే పిల్లలు కూడా ఎక్కువ. ఇన్ని రకాలుగా విద్యారంగంలో వెనుకబడి పోతున్న ఉత్తరప్రదేశ్‌లో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేయడమే ఎన్నికల్లో పోటీచేసే ప్రతి పార్టీ ప్రధాన ఎజెండా కావాలి. ‘బీమారు’ రాష్ట్రాల్లోనే అక్షరాస్యత, నేర్చుకునే సామర్థ్యం తక్కువ. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలను కలిపి బీమారు రాష్ట్రాలని పిలుస్తున్నారు. 2020 నాటికి దేశంలో పనిచేసే వయో జనాభా 86.90 కోట్లకు చేరుకుంటోందని అంచనా వేసిన నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల నుంచి 14 ఏళ్లలోపు చదువుకునే పిల్లల జనాభా 43.6 శాతం ఉంటుందని ‘ఇండియా స్పెండ్‌’ అంచనా వేసింది. వీరందరికీ విద్యను అందించే సౌకర్యాలు మాత్రం అందుబాటులో ఉండవని విశ్లేషించింది. 
అక్షరాస్యత అంతంత మాత్రమే
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో అక్షరాస్యత 67.72 శాతం. అంటే అక్షరాస్యతలో వెనకబడిన రాష్ట్రాల్లో యూపీది ఎనిమిదో స్థానం. 2001 నాటితో పోలిస్తే దశాబ్దకాలంలో రాష్ట్రంలో అక్షరాస్యత 13.45 శాతం పెరిగింది. అక్షరాస్యత విషయంలో కూడా రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి వ్యత్యాసాలు ఉన్నాయి. ఉత్తరాదిలోని స్రవస్తి జిల్లో అక్షరాస్యత 49 శాతం ఉండగా, ఘజియాబాద్‌ జిల్లాలో 85 శాతం ఉంది. 
టీచర్లు కూడా చాలా తక్కువ
దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన యూపీలో టీచర్ల సంఖ్య దారుణంగా ఉంది. ప్రాథమిక స్థాయిలో ప్రతి 39 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడు చొప్పున ఉన్నారు. జాతీయంగా వీరి నిష్పత్తి 23 మంది విద్యార్థులకు ఒక్క టీచరు చొప్పున ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో  2015–2016 సంవత్సరంలో 25.30 కోట్ల మంది విద్యార్థులకు 6,65,779 మంది టీచర్లు ఉన్నారని ప్రభుత్వం విద్యారంగం డేటా తెలియజేస్తోంది. విద్యాహక్కు ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు కనీసం ఒక్క టీచరు ఉండాలి. ఆ లెక్క ప్రకారం యూపీకి 8,40,000 మంది టీచర్లు అవసరంకాగా, 1,76,000 మంది టీచర్లు తక్కువున్నారు. టీచర్లు విధులకు ఎక్కువగా గైర్హాజరవుతున్న రాష్ట్రాల్లో కూడా యూపీ రెండో స్థానంలో ఉంది. 
ఖర్చు ఎక్కువ ఫలితాలు తక్కువ
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం 2014–2015లో ప్రతి ప్రైమరి స్కూల్‌ విద్యార్థి (ఒకటి నుంచి ఐదో తరగతి వరకు)పై, ప్రతి అప్పర్‌ ప్రైమరీ స్యూల్‌ (ఆరు నుంచి ఎనిమిదో తరగతి) విద్యార్థిపై తలసరి 13,102 రూపాయలను ఖర్చుపెట్టింది. ఇదే జాతీయ స్థాయిలో సరాసరి 11,252 రూపాయలు ఉంది. 2011 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు 45 శాతం పెరిగినా విద్యార్థులలో నేర్చుకునే సామర్థ్యం మాత్రం పెరగలేదు. ఇప్పటికీ ఈ విషయంలో దేశంలోనే వెనకబడి ఉంది. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో మరీ తగ్గింది
ఒకటో తరగతి పుస్తకాన్ని చదివే మూడో తరగతి పిల్లలు 2006లో 31 శాతం ఉండగా, 2014 సంవత్సరం నాటికి వారి సంఖ్య 35 శాతానికి పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఇలా చదవగలిగేవారి సంఖ్య కూడా పడిపోతోంది. 2006 సంవత్సరంలో 24 శాతం ఉండగా, 2010 నాటికి వారి సంఖ్య 13 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత ఇంకా తగ్గినట్లు తెలుస్తోంది. లెక్కల విషయంలో కూడా విద్యార్థుల ప్రమాణాలు పడిపోయాయి. 
 
బాల కార్మికులు ఎక్కువ
పని చేయడం కోసం బడి ఎగ్గొట్టే పిల్లల సంఖ్య కూడా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ. 2014లో ఏసర్‌ గ్రూప్‌ చేసిన సర్వే ప్రకారం 55 శాతం విద్యార్థులు మాత్రమే బడులకు హాజరవుతున్నారు. ప్రాథమిక పాఠశాల నుంచి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లే పిల్లల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువ. వారి వాటా 79 శాతమేనని అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. జాతీయ పిల్లల హక్కుల పరిరక్షిణా సంస్థ లెక్కల ప్రకారం 6, 24,000 మంది పిల్లలు పని చేస్తున్నారు. వారిలో 8.4 శాతం మంది పిల్లలు 14 ఏళ్లలోపు ప్రాయంవారే. చట్ట ప్రకారం వారు పనిచేయకూడదని తెల్సిందే.

Advertisement
Advertisement