రూ.55 కోట్లు ఎక్కడ? | Sakshi
Sakshi News home page

రూ.55 కోట్లు ఎక్కడ?

Published Tue, Mar 8 2016 3:22 AM

రూ.55 కోట్లు ఎక్కడ? - Sakshi

సాక్షి, చెన్నై: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 55 కోట్లు ఎక్కడ? అని ఎన్నికల కమిషన్‌ను మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. వివరాలతో సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ, నోటీసులు జారీ చేసింది.ఎన్నికల్లోనగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తనిఖీల్లో ఓ వైపు ఓటర్లకు పంచేందుకు తరలించే నగదు పట్టుబడుతున్నా, మరో వైపు ఏదేని పనుల నిమిత్తం నగదు తీసుకుని వెళ్లేవారు గగ్గోలు పెట్టక తప్పడం లేదు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే, పకడ్బందీ వ్యూహంతో నగదు బట్వాడా అడ్డుకునే యత్నాన్ని ఎన్నికల యంత్రాంగం చేసింది.

ఇందులో రూ.55 కోట్ల మేరకు పట్టుబడ్డాయి. ఎన్నికల సమయంలో పలానా చోట, ఇంత మొత్తం, అంత మొత్తం పట్టుబడిందంటూ వివరాల్ని అధికారులు వెల్లడించే వారు. అయితే, ఎన్నికల అనంతరం ఆ నగదు గురించి పట్టించుకునే వారెవ్వరు. ఆ దిశగా మైలాపూర్‌కు చెందిన జె మోహన్‌రాజ్ స్పందించారు. మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదు రూ.55 కోట్ల వరకు ఉందని, ఆ నగదు ఏమయ్యిందో వివరాలను బహిర్గతం చేయాలని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తాను పలుమార్లు ఆశ్రయించినా ఫలితం శూన్యంగా పిటిషన్‌లో వివరించారు.

వారి నుంచి స్పందన లేని దృష్ట్యా, కోర్టును ఆశ్రయిస్తున్నట్టు, ఆ వివరాలు రాబట్టాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. పిటిషనర్ తరఫు వాదనల్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇంతకీ రూ.55 కోట్లు ఏమైనట్టు అని ఎన్నికల యంత్రాంగాన్ని కోర్టు ప్రశ్నించింది. పట్టుబడ్డ ఆ నగదు ఏమైంది? పట్టుబడ్డ సమయంలో పెట్టిన కేసుల పరిస్థితి ఏమిటి, ఎన్నికల అనంతరం తీసుకున్న చర్యలే మిటి? అంటూ పలు ప్రశ్నల్ని సంధిస్తూ, వివరాల్ని సమర్పించాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement