అఖిలేశ్‌కే సైకిల్‌ గుర్తు | Sakshi
Sakshi News home page

అఖిలేశ్‌కే సైకిల్‌ గుర్తు

Published Mon, Jan 16 2017 7:02 PM

అఖిలేశ్‌కే సైకిల్‌ గుర్తు - Sakshi

న్యూఢిల్లీ: తండ్రీకొడుకుల సైకిల్ పంచాయితీలో ఎట్టకేలకు తీర్పు వచ్చింది. సమసమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కే సైకిల్‌ గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఈసీ మరికాసేపట్లో అధికారిక ప్రకటన చేయనుంది.

పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేశ్‌ యాదవ్‌.. సైకిల్‌ గుర్తును కూడా తనకే కేటాయించాలని ఈసీని ఆశ్రయించడం తెలిసిందే. కొడుకు తిరుగుబాటును గుర్తించని తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ సైతం పార్టీ గుర్తుపై ఈసీని ఆశ్రయించారు. ఒకదశలో సైకిల్‌ గుర్తును రద్దుచేసి, ఇరు వర్గాలకు రెండు వేరువేరు గుర్తులు ఇస్తారని ప్రచారంసాగింది. కానీ చివరికి సైకిల్‌ గుర్తు అఖిలేశ్ కే దక్కింది. గుర్తు కేటాయింపుపై నిబంధనలు, గతంలో ఇచ్చిన తీర్పులను క్షుణ్నంగా పరిశీలించిన మీదట నిర్ణయం తీసుకుంటామని సీఈసీ జైదీ పేర్కొన్నారు.

(అఖిలేశ్‌దే సైకిల్‌ - ఈసీ ఉత్తర్వులు: ఇక్కడ క్లిక్‌ చేయండి)


వేగంగా మారుతోన్న రాజకీయాలు..
ఈసీ నిర్ణయం వెలువడగానే అఖిలేశ్‌ వర్గీయుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఢిల్లీ, లక్నో సహా యూపీ అంతటా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అఖిలేశ్‌కు సైకిల్‌ గుర్తు పక్కా కావడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అఖిలేశ్‌ వర్గంలో కీలక నేత రాంగోపాల్‌ యాదవ్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమి ఏర్పాటు ఖాయమని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలో కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డీ, ఆర్‌జేడీ పార్టీలతో మహా కూటమిని ఏర్పాటుచేస్తామని, ఈ మేరకు అవసరమైన చర్చలు ప్రారంభమయ్యాయని రాంగోపాల్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement