దొడ్డిదారిలో ‘విద్యుత్’ దోపిడీ! | Sakshi
Sakshi News home page

దొడ్డిదారిలో ‘విద్యుత్’ దోపిడీ!

Published Fri, Jan 15 2016 2:37 AM

దొడ్డిదారిలో ‘విద్యుత్’ దోపిడీ! - Sakshi

* విద్యుత్‌ను అధిక ధరకు తెలంగాణకు విక్రయించేందుకు ఏపీ యత్నం
* మిగులు విద్యుత్‌ను పక్క రాష్ట్రానికి ఇవ్వాలంటున్న పునర్విభజన చట్టం
* మిగులు విద్యుత్ విక్రయానికి పీటీసీతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం
* అదే విద్యుత్‌ను తెలంగాణకు అధిక ధరకు అమ్మేందుకు పీటీసీ ప్రయత్నాలు
* యూనిట్‌కు రూ.5.35 లెక్కన 500 ఎంవీ విక్రయానికి టెండర్లు దాఖలు

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇటీవల ఆహ్వానించిన టెండర్లలో ‘సరికొత్త’ పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం చెప్పినా తెలంగాణకు విద్యుత్ వాటా ఇచ్చేందుకు ససేమిరా అన్న ఏపీ ప్రభుత్వం... అధిక ధర దండుకునేందుకు అదే విద్యుత్‌ను దొడ్డిదారిన అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. విభజన చట్టంలోని ‘రైట్ ఆఫ్ రెఫ్యూజల్’ నిబంధనలను కాదని ‘మరో మార్గం’లో తెలంగాణకు విద్యుత్‌ను విక్రయించేందుకు పోటీపడుతోంది. మొత్తంగా ఈ ఉదంతం తెలంగాణ పట్ల ఏపీ పాలకుల వైఖరికి అద్దం పడుతోంది.
 
పీటీసీని అడ్డుపెట్టుకుని..
తెలంగాణ డిస్కంలు ప్రైవేటు కంపెనీల నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం గతంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాలు మే నెలతో ముగియబోతున్నాయి. ఈ లోటును పూడ్చుకోవడానికి 2016 మే 27 నుంచి 2017 మే 25 వరకు ఏడాది కాలానికి 2,000 మెగావాట్ల తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్ల కోసం గత నెలలో డిస్కంలు టెండర్లను ఆహ్వానించాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి మొత్తం 2,500 మెగావాట్లకు టెండర్లు దాఖలయ్యాయి. అందులో యూనిట్‌కు రూ.5.35 చొప్పున  500 మెగావాట్ల ‘ఏపీ జెన్‌కో’విద్యుత్‌ను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ (పీటీసీ) సైతం టెండర్ వేసింది.

దీనిపై తెలంగాణ అధికారులు లోతుగా పరిశీలన జరపగా... విద్యుత్ పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు రాష్ట్ర పునర్విభజన చట్టానికి తూట్లు పొడిచినట్లు బయటపడింది. పునర్విభజన చట్టంలోని 12వ షెడ్యూల్ ప్రకారం... తెలంగాణ, ఏపీల్లో ఏ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నా రెండో రాష్ట్రానికి కేటాయించడానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ ఆ రాష్ట్రం తిరస్కరిస్తేనే మరెవరికైనా అమ్ముకోవచ్చు. అయితే ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఏపీ జెన్‌కో 500 మెగావాట్ల మిగులు విద్యుత్‌ను పీటీసీకి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే విద్యుత్‌ను తెలంగాణకు విక్రయించేందుకు పీటీసీ టెండర్లు దాఖలు చేసింది.
 
ఏటా రూ. 200 కోట్ల భారం..!
వాస్తవానికి ఏపీలో 1,000 మెగావాట్ల మిగులు విద్యుత్ ఉందని... యూనిట్‌కు రూ.4.90 చొప్పున దానిని విక్రయిస్తామని ఆ రాష్ట్ర డిస్కంలు ఇటీవల ఏపీఈఆర్‌సీలో దాఖలు చేసిన ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి. అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ‘రైట్ ఆఫ్ రెఫ్యూజల్’ నిబంధనల ప్రకారం... ఏపీలో ఉన్న ఈ మిగులు విద్యుత్ యూనిట్‌కు రూ.4.90 లెక్కన తెలంగాణకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు పీటీసీ ద్వారా యూనిట్‌కు రూ.5.35 ధరతో 500 మెగావాట్లను తెలంగాణ డిస్కంలు కొనుగోలు చేస్తే... రాష్ట్రంపై ఏటా రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో ‘రైట్ ఆఫ్ రిఫ్యూజల్’ నిబంధనలు అమలు చేసే విధంగా ఏపీపై ఒత్తిడి పెంచాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement