కూల్.. ఫాల్స్ సీలింగ్ | Sakshi
Sakshi News home page

కూల్.. ఫాల్స్ సీలింగ్

Published Sat, Jan 18 2014 2:19 AM

false ceiling reduce heat in house

సాక్షి, హైదరాబాద్: ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లో వేడి తగ్గడమే కాకుండా ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవచ్చు. సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుకోవచ్చు కూడా. టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో ఇంటి పైకప్పును కలపతో తయారు చేసేవారు. కాలక్రమేణా సిమెంట్ ప్లాస్టింగ్‌తో ఇంటి పైకప్పులు మారిపోయాయి. ఉడెన్ సీలింగ్ ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఉడెన్ సీలింగ్‌కు ధర చదరపు అడుగుకు రూ. 200 నుంచి మొదలవుతుంది. సీలింగ్‌కు విద్యుత్ దీపాలు అమర్చుకోవాలనుకుంటే మరో రూ. 2 వేలు ఖర్చు అవుతుంది.
 
 ప్రస్తుతం అల్యూమినియం ఫ్రేమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌లతో చేసే ఫాల్స్ సీలింగ్‌కు ఆదరణ పెరిగింది. సీలింగ్‌కు రెండు నుంచి మూడు అంగుళాల దిగువన ఫాల్స్ సీలింగ్ వేయిస్తే సరిపోతుంది. అయితే ప్రైమరీ సీలింగ్, ఫాల్స్ సీలింగ్ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎంచుకుంటే వివిధ డిజైన్లు, కలర్స్‌తో సీలింగ్‌ను రూపొందించుకునే సౌలభ్యం ఉంటుంది. ధర చదరపు అడుగుకి రూ. 25 నుంచి మొదలవుతుంది. పెయింటింగ్‌కు మరో రూ. 2 వేలు అవుతుంది. డిజైన్ టైల్స్‌తో ఉన్న సీలింగ్‌ను ఎంచుకుంటే పెయింటింగ్ ఖర్చు తగ్గుతుంది. కొత్త ఇంటికే కాకుండా పాత ఇంటికి సైతం ఈ ఫాల్స్ సీలింగ్‌ను వేయించుకోవచ్చు.
 
 ప్రయోజనాలివీ..
 సూర్యుడి వేడి, శబ్దం, అగ్నిప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గటమే కాకుండా విద్యుత్ వినియోగాన్ని బాగా తగ్గించుకోవచ్చు.
గది లేదా హాలు కనీసం పదేళ్ల పాటు అందంగా, విశాలంగా కనిపిస్తుంది.
బాల్కనీ, ఇంటి పైకప్పులో లీకేజీలుంటే ఫాల్స్ సీలింగ్‌తో ఆశించిన ప్రయోజనం
 నెరవేరదు.
 
 జాగ్రత్తలివే..

  • ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి.
  • ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.
  • ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.
  • దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి.

Advertisement
Advertisement