తూటాలకు భయపడక ... | Sakshi
Sakshi News home page

తూటాలకు భయపడక ...

Published Sat, Apr 18 2015 8:13 PM

తూటాలకు భయపడక ...

కాబూల్: ఆమె తాలిబన్ల బెదిరింపులకు తలొగ్గడం లేదు. గుండె నుంచి తూటాలు దూసుకుపోయిన ఫర్వాలేదన్న నిబ్బరం ఆమెది. తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాకిస్థాన్ వీధుల్లో ఆమె ఇల్లిల్లూ తిరుగుతూ పోలియో నివారణకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఆమె పాకిస్తాన్‌కు చెందిన నర్సు. పేరు ఫర్హీనా తౌసీఫ్. ముగ్గురు చిన్న పిల్లల తల్లి. పాక్‌లో మళ్లీ విజృంభిస్తున్న పోలియో వ్యాధిని ఎలాగైనా అరికట్టాలన్న తాపత్రయం ఆమెది. మూడేళ్ల క్రితం పాకిస్తాన్‌లో పోలియో దాదాపు అదుపులోకి వచ్చింది.

ఆ సమయంలోనే పోలియో వ్యాక్సినేషన్ చేయడం వెనుక ‘పాశ్చాత్య దేశాల కుట్ర’ ఉందని, పోలియో చుక్కల పేరిట ప్రమాదకరమైన జీవ రసాయనాన్ని ఎక్కిస్తున్నారని తాలిబన్లు ఆరోపిస్తూ పాక్‌లో ఈ కార్యక్రమాన్ని నిషేధించారు. 2011లో అమెరికా సీఐఏ ఏజెంట్లు, ఒసామా బిన్ లాడెన్ జాడ కనిపెట్టడం కోసం పోలియో ఆరోగ్య కార్యకర్తల ముసుగులో పాక్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని సీఐఏనే స్వయంగా ధ్రువీకరించడం గమనార్హం. ఈ విషయం కనిపెట్టిన తాలిబన్లు, అర్థరహిత ఆరోపణలతో నిషేధాన్ని విధించారు. అప్పటి నుంచి దేశంలో పోలియో చుక్కలు వేస్తూ హెల్త్ వర్కర్లు ఎవరు కనిపించినా నిర్ధాక్షిణ్యంగా కాల్చేస్తున్నారు. ఈ మూడేళ్లలో 80 మందిని తాలిబన్లు కాల్చేశారు.

రెండేళ్ల క్రితం  ఫర్హీనా కళ్ల ముందే ఆమె సహచర నర్సులిద్దరిని తాలిబన్లు కాల్చేసిన ఆమె తన కర్తవ్యాన్ని వదిలిపెట్టలేదు.తన నాయకత్వంలోని బృందంతో పాక్‌లో పోలియో నివారణకు విశేషంగా కృషి చేస్తోంది. గత రెండేళ్లలో ఆమె బృందం దేశంలో 322 పోలియో కేసులను గుర్తించింది. ఉద్యోగానికి రాజీనామా చేయమంటూ భర్త ఎంతో గొడవ చేస్తున్నా ఆమె మాత్రం తన నర్సు ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదు. ‘మీకేమైనా అయితే మీ పిల్లలు ఏమవుతారు’ అని ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ‘అలా జరగకుండా ఉండాలనే నా ఆశ' నా ప్రాణాలకు ముప్పున్న మాట వాస్తవమే. నా పిల్లలతోటి పిల్లలను రక్షించడం నా బాధ్యత. పాక్ నుంచి పోలియోను పూర్తిగా నిర్మూలించేవరకు నేను కృషి చేస్తా. ఆ తర్వాత సమయం ఉంటే నా పిల్లలకు, మా వారికి సమయం కేటాయిస్తా’ అని ఫర్మీనా వ్యాఖ్యానించారు. ఆమెపై ప్రత్యేక కథనాన్ని శనివారం రాత్రి ఏడున్నర గంటలకు బ్రిటీష్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌క్యాస్టింగ్ టెలివిజన్ ‘ఛానల్-4’ ప్రసారం చేసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement