నారాయణా..అంటే చాలు..వచ్చేస్తుంది! | Sakshi
Sakshi News home page

నారాయణా..అంటే చాలు..వచ్చేస్తుంది!

Published Sat, Sep 2 2017 6:21 PM

నారాయణా..అంటే చాలు..వచ్చేస్తుంది! - Sakshi

సాంగ్లి: ఆ రైతు.. బావి వద్దకు వెళ్లి నారాయణా..నారాయణా..అని పిలిస్తే చాలు.. నీళ్లలో ఉన్న చేప పైకి తొంగిచూస్తుంది. అతను నిలబడిన చోటుకు వచ్చేస్తుంది. రెండు నెలలుగా జరుగుతున్న ఈ వింతకు మహారాష్ట్ర సాంగ్లి జిల్లా యెదెమశ్చీంద్ర గ్రామం వేదికయింది.

గ్రామంలో ప్రకాష్‌ పాటిల్‌(60) అనే పెద్ద రైతుకు స్థానికుడొకరు రెండు నెలల కిందట ఒక చేపను ఇచ్చాడు. కూర వండితే చాలా రుచిగా ఉంటుందని చెప్పాడు. అయితే, ప్రకాష్‌ మాత్రం ఆ చేపను తీసుకెళ్లి పొలంలోని బావిలో వదిలేశాడు. కొన్ని రోజుల తర్వాత బావిలో నీటిని తోడుకునేందుకు బకెట్‌ను ముంచగా ఆ చేప అందులోకి వచ్చింది. దానిని జాగ్రత్తగా పట్టుకుని తిరిగి బావి నీళ్లలోకే వదిలేశాడు పాటిల్‌. క్రమంగా చేప పట్ల ఇష్టం పెరిరగడంతో దానికి ‘నారాయణ..’ అని పేరు పెట్టాడు.

పాటిల్‌ ప్రతిరోజూ బావి వద్దకు వెళ్లి ‘నారాయణా..నారాయణా ఇటురా..’ అని పిలవగానే చేప అక్కడికి వచ్చేస్తుంది. దానిని ఆయన జాగ్రత్తగా పట్టుకుని ముద్దాడి తిరిగి నీళ్లలో వదిలేస్తాడు. ఈ విడ్డూరం గురించి యెదెమశ్చీంద్ర చుట్టుపక్కల గ్రామాల్లో చర్చ మొదలైంది. పలు జాతీయ మీడియా సంస్థల్లోనూ ‘రైతు-చేప బంధం’ గురించి వార్తలు వచ్చాయి. సినిమాల్లో చూసే దృశ్యాలు తమ ఊర్లోనూ జరుతుండటం వింతగా అనిపిస్తుందని యెదెమశ్చీంద్ర వాస్తవ్యుడొకరు చెప్పారు. ప్రస్తుతం నారాయణ పొడవు రెండడుగులు.

Advertisement

తప్పక చదవండి

Advertisement