ఈ విషయంలో ఎవరి సలహా తీసుకోలేదు | Sakshi
Sakshi News home page

ఈ విషయంలో ఎవరి సలహా తీసుకోలేదు

Published Sat, May 13 2017 8:17 AM

ఈ విషయంలో ఎవరి సలహా తీసుకోలేదు - Sakshi

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌కోమీ తొలగింపు తప్పదు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి


వాషింగ్టన్‌: న్యాయవ్యవస్థ సూచనలతో సంబంధంలేకుండా తనకున్న విశిష్ట అధికారాలను వినియోగించి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీని విధుల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. వైట్‌హౌస్‌ వర్గాలు మాత్రం అత్యున్నత న్యాయాధికారుల సలహా మేరకే అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ట్రంప్‌ మాట్లాడుతూ కోమీని విధుల నుంచి తొలగించేందుకు తాను ఎవరి సలహా తీసుకోలేదని తెలిపారు. అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెసన్స్, డిప్యూటీ అటార్నీ జనరల్‌ రాడ్‌ రోషెన్‌ స్టెయిన్‌లతో సోమవారం సమావేశమైన ట్రంప్‌ కోమీ తొలగింపునకు గల కారణాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్‌ వెల్లడించింది.

తాను ఎఫ్‌బీఐ దర్యాప్తు పరిధిలో ఉన్నానా? అని కోమీని అనేక మార్లు ప్రశ్నించానని అందుకు ఆయన లేదని బదులిచ్చినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. కోమీని ప్రభావితం చేయడానికి, అతనిపై ఒత్తిడి తేవడానికీ ఎన్నడూ ప్రయత్నించలేదని ట్రంప్‌ అన్నారు. ఎఫ్‌బీఐ మాజీ చీఫ్‌పైన కూడా ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. ఆయన్ని ఒక షోబోట్‌గా అభివర్ణించారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ సమగ్రతను ఆయన చెడగొట్టారని అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం నాటికి ఎఫ్‌బీఐ సంక్షోభంలో ఉందన్న విషయం మనందరికీ తెలిసిందేనని, ఈ ఏడాది సమయంలో అది ఏమాత్రం మెరుగుపడలేదని అన్నారు.

కోమీ అధికారుల విశ్వాసాన్ని కోల్పోయారని ఎఫ్‌బీఐ తాత్కాలిక డైరెక్టర్‌ ఆండ్రూ మెక్‌క్యాబ్‌ వెల్లడించిన కాసేపటికే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ బృందం రష్యాతో కుమ్మక్కయిందనే ఆరోపణలను ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Advertisement
Advertisement