దేశీ ఫార్మా కంపెనీలకు భలే చాన్స్! | Sakshi
Sakshi News home page

దేశీ ఫార్మా కంపెనీలకు భలే చాన్స్!

Published Fri, Dec 13 2013 3:11 AM

దేశీ ఫార్మా కంపెనీలకు భలే చాన్స్!

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒత్తిడి నివారణకు వినియోగించే సింబల్టా ఔషధానికి జనరిక్ వెర్షన్ తయారు చేసి విక్రయించడానికి డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మాతో సహా ఐదు దేశీయ కంపెనీలకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. ఆత్మహత్య చేసుకోవాలని ఒత్తిడికి గురయ్యే వారి చికిత్సకు వినియోగించే ఈ ఔషధానికి అమెరికాలో నాలుగు బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ ఉన్నట్లు అంచనా. దీంతో ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన దేశీయ కంపెనీలు అరబిందో, డాక్టర్ రెడ్డీస్‌తో సహా లుపిన్, సన్‌ఫార్మా గ్లోబల్ ఎఫ్‌జెడ్‌ఈ, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఆదాయాలు రానున్న కాలంలో గణనీయంగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
 ఊరిస్తున్న భారీ మార్కెట్...
 ఇప్పటివరకు సింబల్టా ఔషధంపై ప్రత్యేక హక్కులు కలిగి ఉన్న ఎలి లిల్లీ చెప్పిన ప్రకారం గడిచిన తొమ్మిది నెలల్లో 3.4 బిలియన్ డాలర్ల ఆదాయం ఈ ఔషధం నుంచే సమకూరింది. కాని ఎలీ లిల్లీకి సింబల్టా పైన ఉన్న ప్రత్యేక హక్కులకు కాలపరిమితి డిసెంబర్ 11తో ముగిసిపోవడంతో దేశీయ కంపెనీలకు జనరిక్ వెర్షన్‌తో అమెరికాలో విక్రయించడానికి అనుమతి లభించింది.
 

Advertisement
Advertisement