కొత్త ఐటీఆర్ ఫారమ్‌లు వచ్చాయ్ | Sakshi
Sakshi News home page

కొత్త ఐటీఆర్ ఫారమ్‌లు వచ్చాయ్

Published Mon, Jun 1 2015 2:57 AM

కొత్త ఐటీఆర్ ఫారమ్‌లు వచ్చాయ్ - Sakshi

న్యూఢిల్లీ: సరళీకరించిన కొత్త ఆదాయపు పన్ను రిటర్ను ఫారాల(ఐటీఆర్)ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఐటీఆర్-2, 2ఏలను మూడు పేజీలకు కుదించామని, ఇతర వివరాలను షెడ్యూల్స్‌లో నింపాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వివాదాస్పద విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు జరగని(డార్మంట్) బ్యాంక్ ఖాతాల వివరాల వెల్లడి నిబంధనను ఈ కొత్త ఫారాల నుంచి తొలగించారు. అదేవిధంగా రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31 వరకూ గడువు పొడిగించారు. ప్రతియేటా ఈ గడువు జూలై 31 వరకూ ఉంటున్న సంగతి తెలిసిందే.
 
  మూలధన లాభాలు, వ్యాపారం/వృత్తి లేదా విదేశీ ఆస్తులు/ఆదాయం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు(హెచ్‌యూఎఫ్) కొత్త ఐటీఆర్ 2ఏ ఫారాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా,  అసెస్సీలకు పాస్‌పోర్టు గనుక ఉంటే ఆ నంబర్‌ను మాత్రం తెలియజేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాలో అసెస్సీ కలిగివున్న కరెంట్/సేవింగ్స్ అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్ కోడ్‌ను రిటర్నుల్లో పేర్కొన్నాలని.. అయితే, అకౌంట్స్‌లో బ్యాలెన్స్ ఎంతుందనేది వెల్లడించక్కర్లేదని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఆన్‌లైన్‌లో రిటర్నుల దాఖలుకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నామని.. జూన్ మూడో వారం నుంచి ఇది అసెస్సీలకు అందుబాటులోకి వస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది.
 

Advertisement
Advertisement