ప్రపంచంలోనే తొలి రోబో తార ఇదే! | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలి రోబో తార ఇదే!

Published Mon, Nov 2 2015 5:33 PM

ప్రపంచంలోనే తొలి రోబో తార ఇదే!

టోక్యో: జపాన్ చిత్ర నిర్మాతలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ‘రోబో మూవీ స్టార్’ను సృష్టించారు. ముమ్ముర్తులా మనిషిలాగే ఉండే ఆ రోబో నవ్వగలదు, కనుబొమ్మల కదలికలతో హావభావాలను వ్యక్తం చేయగలదు, మనిషిలాగా మాట్లాడగలదు, పాడగలదు. ఎవరు డబ్బింగ్ చెప్పినా దానికి అనుగుణంగా పెదవులను కదలించగలదు.

 ప్రముఖ జపాన్ దర్శకుడు కోజి ఫుకడ నిర్మించిన ‘సయోనారా’ చిత్రంలో లియోనా పాత్రలో ఈ రోబో తార అద్భుతంగా నటించింది. ఆండ్రాయిడ్ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ రోబో తారకు ‘జెమినాయిడ్ ఎఫ్’ అని నామకరణం కూడా చేశారు. అణు ప్రమాదం మానవులపై ఎలాంటి దారుణ ప్రభావాన్ని చూపిస్తుందన్న ఇతివృత్తంతో నిర్మించిన సయోనార చిత్రంలో ప్రధాన పాత్ర రోబో తారదే. కాకపోతే అందులో పాత్రకు తగ్గట్టుగానే రోబో నడవలేదు. వీల్‌చైర్‌కే అంకితమవుతుంది.

 మానవులను పోలిన రోబోలను సృష్టించడంలో ప్రపంచ ఖ్యాతి గడించిన హిరోషి ఇషిగురో యంత్ర పరికరాలతోపాటు రబ్బర్‌ను ఉపయోగించి ఈ రోబో తారను సృష్టించారు. దీనికి కేవలం 76 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని దర్శకుడు కోజి తెలిపారు. యంత్రల్లా ఉండే రోబో క్యారెక్టర్లకు గ్రాఫిక్స్ ఉపయోగించి నటింపచేయడం, లేదా రోబో పాత్రల్లో నిజమైన నటులే నటించడం ఇప్పటివరకు మనం సినిమాల్లో చూశాం. ఇప్పడు అచ్చం మనిషి పాత్రలో రోబో నటించడం ప్రపంచంలో ఇదే మొదటి సారని  కోజి తెలిపారు. మోటారు యంత్రాలు, ల్యాప్‌ట్యాప్ ద్వారా నియంత్రించడం ద్వారా రోబో తారను నటింప చేశామని ఆయన చెప్పారు. సయోనారా చిత్రం గతవారం జపాన్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు విడుదల చేసేది చిత్ర నిర్మాతలు ఇంకా వెల్లడించలేదు.

 సినీ తారలతో నటింపచేయడం కన్నా రోబోలతో నటింపచేయడమే చాలా సులభమనే విషయం తనకీ సినిమా ద్వారా అనుభవపూర్వకంగా తెల్సిందని, పైగా ప్రశస్త భోజనం కావాలని, లగ్జరీ సూట్లు కావాలని డిమాండ్లు ఉండవని జోజి తెలిపారు. కాకపోతే ఎప్పుడైనా మరమ్మతు అవసరం కావచ్చని, వాటికి కూడా నిజమైన తారలతో పోల్చుకుంటే ఖర్చు తక్కువేనని తెలిపారు. తన చిత్రం చివరలో ఇతర తారలకు ఇచ్చినట్లే రోబో తారకు కూడా క్రెడిట్‌ లైన్  ఇచ్చానని ఆయన చెప్పారు. ఈ రోబో తారలను మరింత ఆధునీకరిస్తే భవిష్యత్తులో నిజమైన తారల డిమాండ్ పడిపోవచ్చు లేదా వారి అవసరమే రాకపోవచ్చునేమో!

Advertisement
Advertisement