Sakshi News home page

మీరూ ఫారిన్‌లో ఫండించొచ్చు

Published Sun, Aug 18 2013 1:02 AM

మీరూ ఫారిన్‌లో ఫండించొచ్చు - Sakshi

  •    ఏడాదిలో 30% పైగా లాభాలందించిన విదేశీ ఫండ్స్
  •    రూపీ పతనం ప్రధాన కారణం
  •    పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యానికి ఓవర్‌సీస్ ఫండ్స్ బెస్ట్
  • స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి... మరో పక్క రూపాయి బక్కచిక్కిపోతోంది. కాని కొన్ని ఫండ్స్ మాత్రం లాభాలను కురిపిస్తున్నాయి. రూపాయి క్షీణత వల్ల విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో సెన్సెక్స్ కేవలం ఆరు శాతం లాభాలను మాత్రమే అందిస్తే... ఓవర్సీస్ ఫండ్స్ మాత్రం 30 శాతాన్ని మించి లాభాలను అందిస్తున్నాయి. అమెరికా వంటి సంపన్న దేశాలు తిరిగి వృద్ధి బాటలోకి రావడం, ఇదే సమయంలో రూపాయి విలువ గణనీయంగా క్షీణించడంతో ఈ ఫండ్స్ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చి పెడుతున్నాయి. ఇప్పట్లో రూపాయి బలపడే అవకాశాలు కనిపించకపోతుండటం, దేశీయ మార్కెట్ల కంటే విదేశీ మార్కెట్లు గరిష్టస్థాయి వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఓవర్సీస్(విదేశీ) ఫండ్స్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి.

     
     విదేశీ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే వారికి ఈ ఫండ్స్ అనువుగా ఉంటాయి. అంతేకాకుండా పోర్ట్ ఫోలియోలో వైవిధ్యంలో భాగంగా విదేశీ ఈక్విటీలకు కొంత మొత్తం కేటాయించడం ఉత్తమం. సాధారణంగా మొత్తం పోర్ట్‌ఫోలియో విలువలో 15 శాతం మించకుండా ఓవర్సీస్ ఈక్విటీ ఫండ్స్ కేటాయించమని నిపుణులు సూచిస్తున్నారు. విదేశీ మార్కెట్లో పరోక్షంగా చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండటం ఈ ఓవర్సీస్ ఫండ్స్‌లోని ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు అమెరికా మార్కెట్ కోలుకుంటుండడం, అక్కడి సూచీలు గరిష్టస్థాయి వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఆయా మార్కెట్లకు చెందిన ఫండ్స్ అధిక లాభాలను అందిస్తున్నాయి. కేవలం రూపాయి  క్షీణత గురించే కాకుండా ఆయా దేశాల మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టడం మంచిది.
     
     ఎవరు అందిస్తున్నారు?
     ఇప్పుడు అనేక విదేశీ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా అమెరికా, జపాన్, చైనా మార్కెట్లకు చెందిన పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, డీఎస్‌పీబీఆర్ వంటి సంస్థలు అమెరికాకు చెందిన పెద్ద కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసే పథకాలను అందిస్తున్నాయి. జేపీ మోర్గాన్ ఆసియా, చైనా, మధ్యప్రాచ్య దేశాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలను ఆఫర్ చేస్తోంది. ఇవికాకుండా విదేశీ మైనింగ్, ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏ దేశంపై ఆసక్తి చూపిస్తున్నారు? వీటిల్లో ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారన్న విషయాలపై అవగాహన పెంచుకున్న తర్వాత పథకాన్ని ఎంచుకోండి. ఒకేసారిగా కాకుండా కొంత మొత్తం చొప్పున ‘సిప్’ విధానంలో కూడా వీటిల్లో ఇన్వెస్ట్ చేయెచ్చు.
     
     ఇలాగే ఉండదు...
     ప్రస్తుత పరిస్థితుల్లో ఓవర్సీస్ ఫండ్స్ అధిక లాభాలను అందిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ అత్యధికంగా 36 శాతం రాబడిని అందించింది. కాని ఇదేవిధమైన లాభాలు తర్వాత కూడా లభిస్తాయన్న హామీ లేదు. రూపాయి కోలుకోవడం మొదలైతే ఆ మేరకు లాభాలు తగ్గొచ్చు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు తలకిందులు కావచ్చు. కాని పోర్ట్‌ఫోలియో వైవిధ్యంలో భాగంగా కొంత మొత్తం వీటికి కేటాయించడం ఉత్తమం.
     - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం

Advertisement

తప్పక చదవండి

Advertisement