ఫార్చూన్ పవర్ జాబితాలో నలుగురు భారత మహిళలు | Sakshi
Sakshi News home page

ఫార్చూన్ పవర్ జాబితాలో నలుగురు భారత మహిళలు

Published Mon, Oct 21 2013 12:53 AM

ఫార్చూన్ పవర్ జాబితాలో నలుగురు భారత మహిళలు

న్యూయార్క్: ఫార్చ్యూన్ మ్యాగజైన్ రూపొందించిన అంతర్జాతీయ అగ్రశ్రేణి 50 మహిళా వ్యాపార వేత్తల జాబితాలో నలుగురు భారత మహిళలకు స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చిత్రా రామకృష్ణ(17 వ స్థానం),  యాక్సిస్ బ్యాంక్ శిఖా శర్మ(32వ స్థానం), హెచ్‌ఎస్‌బీసీ నైనా లాల్ కిద్వాయ్(42వ స్థానం)లో ఉన్నారు.
 
  గత ఏడాది జాబితాలో ఐదో స్థానంలో ఉన్న కొచర్ ఈ ఏడాది జాబితాలో ఒక స్థానం మెరుగై నాలుగో స్థానానికి ఎగబాకారు. ఎన్‌ఎస్‌ఈ చీఫ్ చిత్రా రామకృష్ణన్ తొలిసారిగా ఈ జాబితాలో చోటు సాధించారు. ఈ జాబితాలో తొలి స్థానాన్ని బ్రెజిల్‌కు చెందిన ఇంధన దిగ్గజం పెట్రోబాస్ సీఈవో మరియా దాస్ గ్రేకాస్ ఫోస్టర్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో టర్కీకి చెందిన సుబాన్సి హోల్డింగ్స్ గులేర్ సుబాన్సి, ఆస్ట్రేలియా బ్యాంక్ దిగ్గజం, వెస్ట్‌ప్యాక్ సీఈవో గెయిల్ కెల్లీ ఉన్నారు. 
 
 ఇక అమెరికాకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఏడాది టాప్ 50 శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి తన రెండో  స్థానాన్ని ఈ ఏడాది కూడా నిలుపుకున్నారు. మొదటి స్థానంలో ఐబీఎం గిన్ని రొమెట్టీ, మూడో స్థానంలో డ్యుపాంట్ ఎల్లెన్ కుల్‌మన్‌లు ఉన్నారు. కంపెనీ పరిమాణం, అంతర్జాతీయంగా ఆ కంపెనీ నిర్వహిస్తున్న వ్యాపారం ప్రాముఖ్యత, ఆ వ్యక్తి వ్యాపార కెరీర్, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు తదితర అంశాల ఆధారంగా ఆ జాబితాను రూపొందించామని ఫార్చ్యూన్ మ్యాగజైన్ పేర్కొంది. 
 
 చందా కొచర్        ఐసీఐసీఐ    4వ ర్యాంక్
 చిత్రా రామకృష్ణన్ ఎన్‌ఎస్‌ఈ 17
 శిఖా శర్మ       యాక్సిస్ బ్యాంక్ 32
 నైనాలాల్ కిద్వాయ్ హెచ్‌ఎస్‌బీసీ 42
 

Advertisement

తప్పక చదవండి

Advertisement