సూపర్ 30పై విదేశీ సినిమా | Sakshi
Sakshi News home page

సూపర్ 30పై విదేశీ సినిమా

Published Wed, Jul 22 2015 5:50 PM

సూపర్ 30పై విదేశీ సినిమా

పాట్నా: సూపర్-30 ఈ పేరు మీరు వినే వింటారుగా.. ఈ మధ్యకాలంలో చాలాసార్లు విశిష్ఠ స్థానంతో వార్తల్లోకి వచ్చిన పేరిది. బీహార్లో ఆనంద్ కుమార్ నిర్వహిస్తున్న ఐఐటీ-జేఈఈ కోచింగ్ ఇన్స్టిట్యూటే సూపర్-30. నిరుపేదలైన విద్యార్థులకు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా కోచింగ్నిచ్చి ఖరగ్పూర్ వంటి దేశంలోనే ప్రముఖ ఐఐటీలకు పేదరికంలో ఉన్న మేధావులను తరలించే సంస్థ. ఈ సంస్థ నిర్వహిస్తున్న గొప్పపనులకు ముగ్దుడైపోయి.. పాస్కల్ ప్లిస్సన్ అనే ఓ ప్రెంచి డైరెక్టర్ ఏకంగా 'ది బిగ్ డే' అనే చిత్రం తీశాడు. మొత్తం 90 నిమిషాలతో దీనిని రూపొందించాడు.

ఇప్పటికే ఈ చిత్రం తాలుకు ఫొటోలు, వీడియో క్లిప్పులు పలు టీవీల్లో, యూట్యూబ్లో కూడా కనువిందుచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ప్రపంచంలోని నాలుగు ప్రత్యేక కథలు ఇమిడి ఉన్నాయి. ఇందులో ఒక కథ సూపర్ 30లో కోచింగ్ తీసుకొని ప్రస్తుతం ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్లో విద్యనభ్యసిస్తున్న నిధిజా అనే అమ్మాయిది. ఆమె 2014లో జేఈఈ సాధించింది. ఇప్పుడు నిదిజాను, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్కుమార్ను, ఆమె తల్లిదండ్రులను ఫ్రాన్స్లో జరిగే చిత్రానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా డైరెక్టర్ పాస్కల్ ఆహ్వానించాడు.

ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని బీహార్లో షూటింగ్ చేస్తుంటే గతంలో చూశానని, ఇప్పుడు విడుదల కానుండటంతో ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. నిధి చాలా కష్టపడి పైకొచ్చిన అమ్మాయి అని, అలాంటి అమ్మాయి కథ కూడా ఇందులో ఉండటం గర్వించదగిన విషయమని తెలిపారు. కష్టాలు, కన్నీళ్ల మధ్య ఉన్న నలుగురు చిన్నారులు స్వయం కృషితో ఎలా విజయం సాధించారనేదే 'ది బిగ్ డే' అని తెలిపారు.

Advertisement
Advertisement