మద్యం తాగించి, ఆపై కత్తితో.. | Sakshi
Sakshi News home page

మద్యం తాగించి, ఆపై కత్తితో..

Published Wed, May 10 2017 12:36 PM

మద్యం తాగించి, ఆపై కత్తితో.. - Sakshi

► యువకుడి హత్య
►పాత కక్షలే కారణం
►లొంగిపోయిన నిందితులు..?

కిరణ్, రాజ్‌కమల్, అజయ్‌. వీరు ముగ్గురూ స్నేహితులు. కొన్నాళ్ల తరువాత కిరణ్‌కు, మిగతా ఇద్దరికీ మధ్య స్నేహం చెడింది. శతృత్వం పెరిగింది. కిరణ్‌పై ఆ ఇద్దరూ కక్ష పెంచుకున్నారు. ఆ కక్ష ఎంతగా పెరిగిందంటే.. కసిగా పొడిచి చంపేద్దామన్నంతగా...! చివరికి, ఆ ఇద్దరూ అంతపనీ చేశారు.


కారేపల్లి(వైరా), ఇల్లెందు: కారేపల్లి మండలంలోని ఉసిరికాయలపల్లి సమీపంలో ఓ యువకుడిని దారుణంగా చంపేశారు. ఇల్లెందు, కారేపల్లి పోలీసులు, హతుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇవీ...‘‘ఇల్లందు పట్టణంలోని లలిత కళామందిర్‌ ఏరియాకు చెందిన కుంజా కిరణ్‌(26)ను, 14వ నెంబర్‌ బస్తీకి చెందిన ఒలిపిరెడ్డి రాజ్‌కమల్, తాటి అజయ్‌కుమార్‌ కలిసి పార్టీ చేసుకుందామంటూ మద్యం బాటిళ్లు, కూర్చునేందుకు పట్టా తీసుకుని ఆటోలో ఉసిరికాయలపల్లి సమీపంలోని ఈద్గా వద్దకు సోమవారం రాత్రి చేరుకున్నారు. అక్కడి నుంచి ముగ్గురూ కలిసి ఓసీ డైవర్షన్‌ బీటీ రోడ్డు వైపు వెళ్లారు. అక్కడ మద్యం తాగారు.

మద్యం తలకెక్కిన తరువాత కిరణ్‌కు, మిగతా ఇద్దరికి మధ్య చిన్నపాటి ఘర్షణ, పెనుగులాట జరిగింది. కిరణ్‌ తలపై మద్యం సీసాలతో మిగతా ఇద్దరు  దాడి చేశారు. తమతోపాటు తెచ్చుకున్న కత్తితో పొడిచారు. స్పృహ కోల్పోయిన కిరణ్‌ను పట్టాలో చుట్టి రోడ్డుకు దూరంగాగల చెట్ల పొదల వద్దకు మోసుకెళ్లారు. అక్కడ అతడి తలపై ఓ దుంగతో, రాయితో గట్టిగా మోదారు. చనిపోయాడని నిర్థారించుకున్న తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పోలీసులకు లొంగుబాటు..?

విశ్వసనీయంగా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘కిరణ్‌ను హత్య చేసిన తరువాత ఆ ఇద్దరూ లొంగిపోవాలా..? పారిపోవాలా..? అనే విషయమై తర్జనభర్జన పడ్డారు. నేరుగా లొంగిపోతే ఇంటరాగేషన్ ఉండదని భావిం చారు. రాత్రి 10.30 గంటల సమయంలో  ఇల్లెందు పోలీస్‌ స్టేషన్ లో లొంగిపోయారు. ఆ తరువాతనే కిరణ్‌ కుటుంబీకులకు పోలీసుల నుంచి సమాచారం వెళ్లింది. తమ ఇద్దరిని కొంతకాలంగా కిరణ్‌ వేధిస్తున్నాడని, అందుకే చంపాలనుకున్నామని తెలిపారు. గొడవలొద్దు.. కలిసుందామంటూ మద్యం పార్టీకి పిలిచామని, అక్కడ హత్య  జరిగిందని పోలీసులతో ఆ ఇద్దరు చెప్పారు’.

పొదల్లో మృతదేహం

కిరణ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి అర్ధరాత్రి రెండు గంటల వరకు (ఆ ఇద్దరు చెప్పిన ప్రాంతంలో) వెతికారు. మృతదేహం కనిపించకపోవడంతో వెనుదిరిగా రు. ఉదయం ఐదు గంటల నుంచి వెతుకుతుండగా ఒకచోట రక్తపు మడుగులో కిరణ్‌ మృతదేహం కనిపించింది. హత్య స్థలంలో మృతదేహాన్ని సింగరేణి  సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ కిరణ్‌కుమార్, ఇల్లెందు సీఐ అల్లం నరేందర్, డీఎస్పీ ప్రకాశరావు సందర్శించారు.

హతుడిపై పాత కేసులు

పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని, మృతుడు కిరణ్‌పై గతంలో కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. రాజ్‌కమల్, అజయ్, దైద శివ, మరికొందరు కలిసి తన కొడుకును చంపారని కిరణ్‌ తండ్రి మంగయ్య  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారేపల్లి ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 

Advertisement
Advertisement