ఏప్రిల్ నుంచి వీసా ఫీజుల మోత | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ నుంచి వీసా ఫీజుల మోత

Published Sun, Dec 20 2015 2:06 AM

From April crash of visa fees

ఫైలుపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు ఒబామా

 వాషింగ్టన్: అమెరికాలోని భారత ఐటీ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని భారీగా వడ్డించిన వీసా ఫీజులు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ బిల్లును అమెరికా చట్టసభలు ఇప్పటికే ఆమోదించగా... ఈ ఫైలుపై అధ్యక్షుడు  ఒబామా శుక్రవారం సంతకం చేశారు. దీంతో హెచ్1బీ వీసాకోసం సుమారు రూ. 2.7 లక్షలు, ఎల్1 వీసా కోసం రూ. 3.2 లక్షలు చెల్లించాల్సి రానుంది.

 పెంచుకుంటూ పోతున్న అమెరికా..: అమెరికాలోని ఐటీ సంస్థల్లో పనిచేసేందుకు వచ్చే విదేశీ నిపుణుల కోసం హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. అసలు హెచ్1బీ దరఖాస్తు ఫీజు సుమారు రూ. 20 వేలు (325 డాలర్లు). 2005లో ‘ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఫీజు’ పేరుతో రూ. 33,000 (500 డాలర్లు) వడ్డించారు. ఆ తర్వాత ‘ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ ఫీజు’ పేరిట 25 మందికంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలకు హెచ్1బీ వీసాపై సుమారు రూ. లక్ష (1,500 డాలర్లు) ఫీజు విధించారు. తాజాగా ప్రత్యేక ఫీజును సుమారు రూ. 3 లక్షలకు పెంచింది. ఇక వీటన్నింటికీ తోడు హెచ్1బీ వీసాల దరఖాస్తులను 15 రోజుల్లోపే పరిశీలించేందుకు రూ. 80 వేలు (1,225 డాలర్లు) వసూలు చేస్తుంది. వీటన్నింటికి తోడు వీసా దరఖాస్తులను ఫైలింగ్ చేసేందుకూ రూ. 60 వేల నుంచి రూ. లక్ష దాకా చెల్లించాల్సిందే. అంటే మొత్తంగా భారత కంపెనీలు ఒక్కో హెచ్1బీ వీసా కోసం రూ. 6 లక్షలు కట్టాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement